రైతులకు ఏపీ మంత్రి క్షమాపణ
posted on Mar 28, 2021 @ 6:48PM
వరిసాగు ఉత్త సోమరిపోతు వ్యవహారం అంటూ ఏపీ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘాలు మండిపడ్డాయి. ఏలూరులో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టాయి. మంత్రి శ్రీరంగనాథరాజు వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
రైతుల ఆందోళనతో మంత్రి వెనక్కి తగ్గారు మంత్రిశ్రీరంగనాథరాజు . వరిసాగుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందడంలేదని, ఆ పథకాల ఫలాలను భూయజమానులే అనుభవిస్తున్నారని, రైతుబిడ్డను కావడంతో నిన్న అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. తాను తొందరపాటుతో ఈ వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. రైతులు ఎవరైనా బాధపడితే తనను క్షమించాలని కోరారు. రైతు సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటన చేశారు.
వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని మంత్రి రంగనాథ రాజు శనివారం వ్యాఖ్యానించారు. ‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు. బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది’’ అని మంత్రి రంగనాథ రాజు వ్యాఖ్యానించారు. మంత్రి మాటలతో కిసాన్‌మేళాలో పాల్గొన్న రైతులు విస్తుపోయారు.