ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్.. కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలి
posted on Sep 14, 2020 @ 3:28PM
ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడి తప్పుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో 'రూల్ ఆప్ లా' అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. బాధితుడి మేనమామ నారాయణ స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అధికారులు అధికార పార్టీని సంతృప్తి పరచడానికి పనిచేస్తున్నారని తప్పుబట్టింది. ఇప్పుడు ఏకంగా.. పోలీస్ వ్యవస్థ తమ తీరు మార్చుకోకపోతే.. నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు తెగేసి చెప్పడం.. ఏపీలో పోలీస్ వ్యవస్ద పనితీరుకి అద్దంపడుతోంది.