ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్టే!
posted on Mar 23, 2021 @ 12:42PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలపై ఎస్ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్ ఆశలకు గండి పడినట్లైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ సర్కార్ హడావుడి చేసింది. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇంకా ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నందున.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీపై ఒత్తిడి తెచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా ముగిస్తే మంచిదని కామెంట్ చేశారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం సెలవుపై వెళ్లారు.
మరోవైపు గతంలో పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ షెడ్యూల్ ఇస్తే కరోనా సాకుతో అడ్డుకోవాలని చూసింది వైసీపీ సర్కార్. ఆయనపై యుద్ధమే చేసింది. ఎన్నికలను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టుకు వరకూ వెళ్లింది. ఎక్కడా వారికి అనుకూలంగా రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లింది వైసీపీ. ఇప్పుడు మాత్రం ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మాట మార్చింది. దీంతో వైసీపీ నేతలు, సీఎం జగన్ తీరుపై జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి.