ఏపీలో ఉదయం 9 గంటలకే స్కూల్
posted on Feb 4, 2021 @ 1:54PM
లాక్ డౌన్ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. విద్యార్థుల హాజరు కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల పని వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు జగన్. ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.