ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్.. సుప్రీం కోర్టు కు ఎపి సర్కార్ పిటిషన్
posted on Aug 10, 2020 @ 7:03PM
ఎపి ప్రభుత్వం మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించేందుకు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీని కోసం హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ రెండు రోజుల కిందట సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం విచారణకు వస్తుందని ఏపీ సర్కార్ భావించింది కానీ ఆలా జరగక పోవడంతో తాజాగా దీని పై వెంటనే విచారించాలంటూ మరో అప్లికేషన్ ను దాఖలు చేసింది.
అయితే అప్పటికే ఈ విషయంలో అమరావతి రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదన వినాలని కోరారు. దీంతో ఈ పిటిషన్ కాపీని కెవియట్ వేసిన వారికి కూడా తామే పంపినట్లుగా ప్రభుత్వం తాజా అప్లికేషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్ పై వీలైనంత త్వరగా విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది.
ఇప్పటికే ఈనెల 16న మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోడీని ఆహ్వానించడానికి జగన్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అయితే కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నందున శంకుస్థాపన సాధ్యం కాదు కాబట్టి వీలైనంత త్వరగా న్యాయ పరమైన చిక్కుల నుండి బయట పడాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తోంది.
ఇది ఇలా ఉండగా ఎపి ప్రభుత్వం ఈనెల 14వ తేదీ కల్లా ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈనెల పధ్నాలుగో తేదీకి విచారణను వాయిదా వేసింది. కానీ ఈ లోపే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పధ్నాలుగో తేదీలోగా సుప్రీంకోర్టులో విచారణ జరగకపోతే మళ్ళీ 14న ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినా హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సహజంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నందున అక్కడ పరిష్కారం అయిన తర్వాతే దానికి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు విచారిస్తుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.