రాష్ట్రంలో ఫలితాలు కాస్త ఆలస్యం.. ఎందుకంటే...
posted on May 16, 2014 7:49AM
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ ఈసారి రెండు రకాల పద్ధతులను అనుసరించనుంది. సాధారణంగా ఈవీఎంలో పోల్ అయిన ఓట్లను రెండు పద్ధతులలో లెక్కించవచ్చు. ఇంతకాలం ఒక పద్ధతిని అనుసరించి ఓట్లను లెక్కిస్తూ వస్తున్నారు. అంటే, ఈవీఎంని బ్యాలెట్ యూనిట్ అనే పరికరానికి అనుసంధానం చేస్తే సదరు ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయో తెలుస్తుంది. అలాగే ప్రింటర్ అండ్ ఆగ్జిలరీ యూనిట్ అనే పద్ధతిలో కూడా ఓట్లను లెక్కించవచ్చు. ఎన్నికల కమిషన్ మొదటి నుంచీ బ్యాలెట్ యూనిట్ ద్వారా కౌంటింగ్ జరుపుతోంది. అయితే ఈవీఎంల పనితీరు, కొంతమంది సిబ్బంది కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్టు అనుమానాలు రావడంతో ఈసారి ఓట్లను పై రెండు పద్ధతులలోనూ లెక్కించాలని, రెండు పద్ధతులలో ఓట్లు సరిపోలిన పక్షంలోనే ఫలితం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని కోరారు. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఆమోదం తెలిపారు. దాంతో రాష్ట్రంలో ప్రతి ఈవీఎంలోని ఓట్లను రెండు పద్ధతులలో లెక్కించాక మాత్రమే ఫలితాన్ని ప్రకటిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ప్రకటన కొంత ఆలస్యంగా జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.