కరోనా మన జీవితం లో అంతర్భాగం అవుతుంది: జగన్
posted on Apr 27, 2020 @ 6:19PM
రాష్ట్రంలో అన్ని ఇళ్లను జల్లెడ పడుతున్నామని, ప్రతి హాస్పటల్ లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు 3 సార్లు రేషన్ ఇస్తోంది. రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నా కూడా పేదలకు1000 రూపాయల ఆర్థిక సహాయం అందించాం, పెన్షన్స్ ఇంటికే వెళ్లి అందజేసాం, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పూర్తిగా కట్టడి చేయలేమన్నారు. రాబోయే రోజుల్లో కరోనా తో జీవించాల్సిన పరిస్థితి నెలకొందని, రాబోయే కాలంలో కరోనా మన జీవనంలో అంతర్భాగం అవుతుందని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరోనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది, కరోనా వైరస్ వచ్చి నట్లు అనుమానం వస్తే వెంటనే 104 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. కరోనా అంటరాని వ్యాధి కాదు, కరోనా వైరస్ వచ్చిన వారి పట్ల ప్రజలు కూడా మానవత్వం గా వ్యవహరించాలి, ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.