పని చేసే వారికే నామినేటెడ్ పదవులు
posted on Aug 1, 2025 @ 12:15PM
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెలలో అంటే ఆగస్టులో రెండు కీలకమైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు తెలిపిన ఆయన రాష్ట్రంలో కష్టించి పని చేసే తెలుగుదేశం కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని అన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ రెండు పథకాల విషయంలో పార్టీ నేతలూ, క్యాడర్ చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు.
అన్నదాతా సుఖీభవ కార్యక్రమం శనివారం (ఆగస్టు 2) నుంచీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ నెల 15 నుంచీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో రైతు భరోసా పేరుతో జగన్ రైతులను నిలువునా మోసం చేశారని విమర్శించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతులకు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి ఏడాదికి మూడు విడతలలో 20 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు.