ముందస్తు మత్తులో నాడు బాబు.. నేడు జగన్
posted on Apr 1, 2023 7:02AM
మరో సారి అధికారానికి ముందస్తు అడ్డదారిగా ఎంచుకుని భంగపాటుకు గురైన ముఖ్యమంత్రుల సంఖ్య తక్కువ ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే ముందస్తుకు వెళ్లి అధికారాన్ని నిర్దిష్ట గడువు కంటే ముందే చేజార్చుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇద్దరూ తమ పాలనపై ప్రజా వ్యతిరేకతను పసిగట్టే అది మరింత పెరిగి మొదటికే మోసం రాకుండా జగ్రత్త పడే యోచనతోనూ ముందస్తుకు సిద్ధపడ్డారని చెప్పాలి.
ఏపీ ఆవిర్భావం నుంచి 1978 వరకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా 1982లో నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 202 స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నా ఎన్టీఆర్ ముందస్తుకు వెళ్లి ఘన విజయం సాధించారు.
తర్వాత 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఎన్నికలను నాలుగునెలల ముందుకు జరిపారు. అప్పుడు ఎన్టీఆర్ కు ఆ ముందస్తు కలిసి రాలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
1994లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత 1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు రెండు నెలల ముందు నిర్వహించడంతో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. ఆ తరువాత 2004 వరకూ గడవు ఉన్నప్పటికీ చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు.
2003 నవంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేశారు. వరుస సంవత్సరాలు వర్షాభావంతో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడటం, వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం వంటి కారణాలతో ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇన్ కంబెన్సీ) పెరగడంతో అది పెరగకుండా ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు బావించారు. అలాగే మావోయిస్టుల దాడి తరువాత వచ్చిన సానుభూతి ఆశలు కూడా ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందన్నభావనతో అప్పట్లో చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు వైసీసీ అధినేత, సీఎం జగన్ కూడా అధికారం చేజిక్కించుకున్న నాలుగేళ్లలోనే ప్రజా వ్యతిరేకత తీవ్రం అవ్వడాన్ని గమనించి.. తన ఫ్లాగ్ మార్క్ నగదు పందేరం పథకాలు కొనసాగుతున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి మంచి ఫలితం పొందాలన్న ఉద్దేశంతో ముందస్తుకు మొగ్గు చూపుతున్నారు.
2003లో చంద్రబాబు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ప్రజలలో ఆయన పట్ల, కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడం కూడా అప్పట్లో తెలుగుదేశం పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, తెలుగుదేశం యువనేత లోకేష్ పాదయాత్ర కూడా ప్రజలలో ప్రభంజనం సృష్టిస్తోంది. పాయదాత్రలో ఆయనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అంతటా సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో జగన్ ముందస్తుకు వెడితే ముందస్తుగా అధికారం చేజారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.