ఫైర్ సర్వీసెస్ డీజీగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్
posted on Mar 10, 2023 @ 11:21AM
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి వచ్చారు. ఆయనను ఏపీ సీఐడీ చీఫ్ గా బదలీ చేసే సమయంలో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఏమో జరగవచ్చేమో అని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే సీఐడీ చీఫ్ గా ఆయన తీరు జగన్ పాలన అంత వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక భావన ఉందన్న అనుమానం కలిగితే చాలు సీఐడీ వాలిపోయి.. కేసులు, అరెస్టులూ అంటూ హడావుడి చేసేది. విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న చరిత్ర సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ ది.
అటువంటి సునీల్ కుమార్ ను ఏపీ సర్కార్ అకస్మాత్తుగా బదలీ చేసింది. వెంటనే ఆయనకు మరో పోస్టింగ్ ఇవ్వలేదు. బదలీ చేయడానికి కొద్ది ముందే ఆయనకు డీజీగా పదోన్నతి కూడా కల్పించింది. అలా డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ కు మరో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్ ఏపీ సీఐడీ చీఫ్ గా నియమించింది. జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ నుంచి వచ్చిన తరువాత ఫైర్ సర్వీసెస్ డీజీగా అత్యంత అప్రాధాన్యమైన పోస్టులో నియమించింది.
వాస్తవానికి ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచీ ఇటీవల అకస్మాత్తుగా బదలీ అయ్యే వరకూ సునీల్ కుమారే ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. జగన్ మనసెరిగి ప్రవర్తిస్తున్నారన్న కితాబులు(?) అందుకున్నారు. ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే పని చేస్తున్నదన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. స్వయంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. అలా పదోన్నతి ఇచ్చి నిండా నెలరోజులు అయ్యిందో లేదో అదే జగన్ సర్కార్ ఆయనపై బదలీ వేటు వేసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.
అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది. ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు.
అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అటువంటిది ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం, ఆయన లాంగ్ లీవ్ లో ఉన్న సమయంలోనే.. గతంలో ఆయనపై హై కోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. అదలా ఉంటే ఇప్పుడు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి వచ్చారు. ఇంత కాలం విదేశాలలో ఉన్న ఆయన స్వరాష్ట్రానికి తిరిగి రాగానే జగన్ సర్కార్ ఆయనను అప్రాధాన్య శాఖలో అత్యున్నత హోదాలో నియమించింది.
తద్వారా ఆయన సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో ఏర్పడిన వివాదాలతోనూ, విపక్షాలపై అక్రమ కేసుల వ్యవహారంలోనే ప్రభుత్వానికి ప్రమేయం లేదని చెప్పుకుంటోంది. మరో వైపు సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు ఎటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం సమర్ధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు.