నేడు జరగనున్న క్యాబినెట్ భేటీ కై రంగం సిద్ధం..
posted on Dec 27, 2019 @ 10:09AM
ఏపి రాజధాని కై రైతులు చేస్తున్న ఆందోళనలు అందరికి తెలిసినవే.నేడు ఏపీ రాజధానుల పై ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. రాజధానుల పై ఏ నిర్ణయం తీసుకుంటారు, 10 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు చూసి అమరావతి లోనే ఉంచుతారా లేక విశాఖలో ఉండొచ్చని ముందుగా చెప్పినట్లుగా అక్కడికే తరలిస్తారా అనే దాని పై మంత్రి వర్గ సమావేశం తర్వాత స్పష్టత రానుంది. క్యాబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే యాంటీ నక్సల్స్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు రంగం లోకి దిగారు. సచివాలయానికి వెళ్లే మార్గాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్, మందడం, మల్కాపురం, వెలగపూడి పరిధిలోని రహదారులపై భారీగా పోలీసులను మోహరించారు. సచివాలయ దారిలో ఇవాళ రైతుల నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మందడం గ్రామం లింకు రోడ్లలో ముళ్లకంచెలు వేశారు.
కేబినెట్ భేటీకి సీఎం సచివాలయానికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆయన కాన్వాయ్ తో ఇప్పటికే ఓ ట్రయిల్ వేశారు. మరోవైపు ప్రభుత్వ తీరు పై రాజధాని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇస్తే ఇప్పుడు దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా పోలీసుల మోహరింపు ఆంక్షల విధింపు పై మండిపడుతున్నారు అక్కడి రైతులు. మొత్తం మీద క్యాబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.భేటీ అనంతరం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠం రేకెతిస్తొంది.