ఆర్డినెన్సు రూట్ లో బడ్జెట్.. ఇదేమి దుష్ట సంప్రదాయం
posted on Mar 26, 2021 @ 12:36PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చింది. జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆర్డినెన్సు రూట్లో బడ్జెట్ తీసుకు రావడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని యనమల స్పష్టం చేశారు. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయరాదని కోరారు యనుమల రామకృష్ణుడు.
తిరుపతి ఉప ఎన్నిక, పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయటం పలాయనవాదమని యనుమల ధ్వజమెత్తారు. వార్షిక బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే లెక్కే లేదని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కుంటిసాకులు చూపి బడ్జెట్ వాయిదా వేయలేదన్నారు. గతంలోనూ ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బడ్జెట్‌తో పాటు 3 రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మమ అనిపించుకున్నారని రామకృష్ణుడు మండిపడ్డారు.