బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం! సోము వీర్రాజు సంచలనం
posted on Feb 4, 2021 @ 3:56PM
ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణలో దుబ్బాల అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత బీజేపీ జోరు పెరిగింది. అదే స్పూర్తితో త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. హైకమాండ్ డైరెక్షన్ లోనూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హీట్ పుట్టించే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలంతా బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ సంచలన ప్రకటన చేశారు సోము వీర్రాజు.
బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలకు సవాల్ కూడా విసిరారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తమ పార్టీ చెప్పినంత ధైర్యంగా.. టీడీపీ, వైసీపీ చేయగలదా అని ప్రశ్నించారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పగల దమ్ము దైర్యం వైసీపీ, టీడీపీలకు ఉందా సోము వీర్రాజు సూటిగా అడిగారు. బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బిజెపికే ఉందన్నారు. తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చేయటమే బిజపి మొదటి లక్ష్యం అన్నారు సోము వీర్రాజు.
బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని వెనక బీజేపీకి బలమైన కారణమే ఉందని, తిరుపతి ఉప ఎన్నిక కోసమే సోము ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు. తిరుపతిలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువే. అందుకే వారిని కాకా పెట్టడానికే సోమువీర్రాజు ప్రకటన చేశారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీలను ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారంటున్నారు. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఒకరిద్దరు నేతలు తప్ప కొత్తగా ఎవరూ కమలం గూటికి చేరలేదు. అందుకే ఏదో ఒకటి చేసి పార్టీ గ్రాఫ్ పెంచాలని బీజేపీ భావిస్తుందని తెలుస్తోంది. బీజేపీ ప్రయోగించిన బీసీ ముఖ్యమంత్రి అంశం తిరుపతి ఉప ఎన్నికతో పాటు ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరీ..