సర్వత్రా వ్యతిరేకతే.. గుర్తించిన జగన్ ఏం చేస్తున్నారంటే..?
posted on Jan 30, 2023 @ 1:45PM
తన పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుందన్న సంగతి జగన్ కు అర్ధమైంది. అలాగే కార్యకర్తలూ పార్టీకి దూరం జరిగారనీ గుర్తించారు. దీంతో జగన్ అనివార్యంగా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం, కార్యకర్తలను మళ్లీ పార్టీతరఫున పని చేసేలా చేయడం కోసం చర్చలు చేపట్టడం మొదలు పెట్టారు. పార్టీకి దూరమైన క్యాడర్ ను దగ్గరకు చేర్చుకోవడానికి, వారినే ప్రజల వద్దకు పంపి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే విధంగా వ్యూహ రచన చేశారు.
అధికారంలోకి రాకముందు ఐదేళ్ల పాటు కష్టనష్టాలకు ఓర్చి, సొంత జేబులు ఖాళీ చేసుకని వైసీపీ కోసం.. కాదు కాదు జగన్ ను సీఎంను చేయడం కోసం కష్టపడిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం పట్టించుకోని ఫలితం ఇప్పుడు జగన్ కు అడుగడుగునా కనిపిస్తోంది. వైసీపీ సభలకు ఎంత ప్రయత్నించినా జనాలను తరలించడం గగనమైపోతుండటంతో కార్యకర్తలు పార్టీకి సహకరించి పని చేసేందుకు సిద్ధంగా లేరన్న విషయం అర్ధమైంది. అందుకే ఈ మూడున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు, అదే సమయంలో పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్. అలా చేయడం వల్ల కార్యకర్తల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని కొంత మేరైనా తగ్గించవచ్చన్నది ఆయన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ ఇటీవలి కాలంలో చేపట్టిన నష్టనివారణ యత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయంపై వైసీసీ శ్రేణుల్లోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
గృహ సారథులు, గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లుగా కార్యకర్తలను నియమించడం ద్వారా ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదనే దానికి చెక్ పెట్టడంతో పాటు వారు ప్రజలను నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించ వచ్చనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. కానీ మూడున్నరేళ్లుగా తిన్నారా లేదా అన్న మాట కూడా ఎత్తని జగన్ ఇప్పుడు ఎన్నికల వేడి మొదలయ్యే సరికి కార్యకర్తలను గృహసారథులుగా నియమించేసి,వారిని ప్రజల దగ్గరకు పంపితే నమ్మేస్తారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. అయినా గృహ సారథులు మేం అధికార పార్టీ నుంచి మేమొచ్చాం. మీ సమస్యలు చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం!' అంటూ గృహ సారథులు వెళ్తే.. గడప గడపకూ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకూ ఎదురైన ‘మర్యాదే’ వారికీ ఎదురౌతుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్త మౌతోంది.
అందుకే ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ కార్యకర్తలను ఇన్ టాక్ట్ గా ఉంచుకోవడం కోసం సొంత ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల కుటుంబాలకు ఉచిత వైద్యం అని ప్రకటించారు. ఇక బాలినేని అయితే తన నియోజకవర్గంలో తానే సొంతంగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వ పింఛన్ వివిధ కారణాలతో ఆగిపోయిన వారికీ, అలాగే అర్హత ఉండీ పింఛన్ మంజూరు కాని వారికీ తానే స్వయంగా తన సొంత ఖర్చుతో పింఛన్ అంద జేస్తున్నారు.
అలా సొంత ప్రయత్నాలు చేసుకుంటున్న వారంతా జగన్ విధానాలతో విభేదించి, తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన వారే కావడం గమనార్హం. పార్టీ అవసరాలో, మరో కారణమో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా వారిని పిలిచి బుజ్జగించిన జగన్.. ముందు ముందు వారికి అవసరమైన ప్రాధాన్యత ఇస్తారా, అసలు వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.