ఇదిగో ఇంకో .. ఫార్మ్ హౌస్ కథ
posted on Jan 19, 2023 @ 2:40PM
భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్యేల కొనుగోలుకు,బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ భారాస నాయకత్వం చేసిన ఆరోపణలు, ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేపట్టిన విచారణ చిత్ర విచిత్ర మలుపులు తిరిగి, చివరకు సిబిఐకి చేరింది. సిట్ విచారణ చెల్లదని తేల్చిన రాష్ట్ర హై కోర్టు విచారణను సిబిఐకి అప్పగించాలని ఆదేశించడంతో, డామిట్ కథ అడ్డం తిరిగిందని భారాస ప్రభుత్వం తల పట్టుకుంది. అయితే, పరిస్థితిని మదింపు వేసుకుని కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుతం అప్పీల్ కు వెళ్లింది. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.
అయితే, ఆ ఫార్మ్ హౌస్ కథ.. అలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో ఫార్మ్ హౌస్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారిని ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందని అన్నారు. ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలిసి తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.
అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, భారాస ఆవిర్భావ సభ నేపథ్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాలో దుమారం రేపుతున్నాయి. నిజానికి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో అందరికంటే ముందుగా ఆయనతో జట్టు కట్టింది, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్’ అధ్యక్షుడు కుమార స్వామి. అలాంటిది పార్టీ అవిర్భావ సభకు ఆయనే రాలేదు. సరే, ఆయన బిజీగా ఉండి రాలేక పోయారని అనుకున్నా, అయన తరపున ఆయన కుమారుడో లేదా జేడీఎస్ మరో ముఖ్య నాయకుడో మరొకరో అయినా రావాలి కదా ..కానీ, ఎవరు రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందని అంటున్నారు. నిజానికి , కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగేందుకు, అడుగడుగునా ‘డబ్బు’ మూటలనే నమ్ముకుంటున్నారని అంటున్నారు. సో.. రేవంత్ రెడ్డి చేసియన్ సంచలన ఆరోపణల పై విచారణకు ఆదేశిస్తే, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాని అంటున్నారు.