తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఎక్కడంటే? ఎందుకంటే??
posted on Jul 23, 2022 @ 2:51PM
తెలంగాణలో త్వరలో మరో అసెంబ్లీ స్థానం ఖాళీ కానుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా ? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారెందుకు సిద్ధమయ్యారా ? అంటే, రాజకీయ వర్గాల నుంచి, అవుననే సమాధానమే వస్తోంది.
అవును, గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారనే వార్త మీడియా, సోషల్ మీడియాలలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చాలా జోరుగా షికార్లు చేస్తోంది. అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకున్న కోమటి రెడ్డి సోదరుల రాజకీయం ఎప్పుడు మలుపు తిరుగుతుందో, వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం. అంతే కాదు , కోమటి రెడ్డి సోదరుల మాటల్లో వినిపించే జోరు, చేతల్లో కనిపించదని అంటారు. నిజానికి, ఒక దశలో సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అలాగే పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇక జీవితంలో గాంధీ భవన్ గడప తొక్కేది లేదని శపథం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని పరోక్షంగానే అయినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఆ తర్వాత గాంధీ భవన్ మెట్లు ఎక్కడమే కాదు, సోనియా, రాహుల్ గాంధీ కంటి తుడుపు కానుకగా ఇచ్చిన స్టార్ క్యాంపైనర్ పదవిని కళ్ళ కద్దుకుని మరీ తీసుకున్నారు. ఆరో వెలితో సమానమైన అ పదవితోనే సంతృప్తి చెందారు, సర్దుకు పోయారు.
ఇక రాజగోపాల రెడ్డి, విషయం అయితే చెప్పనే అక్కర లేదు. 2018 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి, గడచిన మూడు సంవత్సరాలుగా రాజగోపాల రెడ్డి పార్టీ మారతారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూనే వుంది. బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్త లొచ్చాయి. అయితే. ఇంతరవరకు ఆ దిశగా ముందడుగు పడలేదు. ఆ ముహూర్తమూ రాలేదు. అయితే, ఈసారి అలా కాదని, నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారని అంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత షా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక గెలుపుతో, పార్టీకి మంరింత ఉపు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వచ్చిన ఉపును, మరో ఉప ఎన్నిక గెలుపుతో మరింత ముందుకు తీసుకు పోయే వ్యూహంలో భాగంగానే, మునుగోడును ఎంచుకున్నారని అంటున్నారు. అందుకే అమిత్ షా ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా నేరుగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షా చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అయితేనే బీజేపీలోకి తీసుకుంటామని రాజ గోపాల రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది.
అందుకు అంగీకరిస్తే ఉప ఎన్నికల భారం మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పడంతో పాటుగా అమిత్ షా ఉప ఎన్నికల్లో గెలుపునకు భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ మునుగోడుతో పాటుగా మరో మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి, చివరకు మునుగోడు పై నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సో .. అదే నిజం అయితే బంతి ఇప్పుడు రాజగోపాల రెడ్డి కోర్టులో ఉందని, ఆయన ఊ .. అంటే కర్ణాటక (ముదస్తు) అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా డిసెంబర్’లో మునుగోడు ఉపేఎన్నిక ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్లే అంటున్నారు.