ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు...
posted on Oct 5, 2019 @ 11:58AM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గత కొన్ని రోజులుగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి కాస్త గందరగోళం చోటు చేసుకోవడానికి ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు ఆ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ముఖ్యులే కారణమని ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కావాలనే కొందరు అక్కరలేని ప్రచారం జరిగేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయనుంది అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమైన మరుసటి రోజే ఏపిపిఎస్సీ మెంబర్ సెక్రెటరీ మౌర్యనూ బదిలీ చేసింది సర్కారు. మెంబర్ సెక్రెటరీని బదిలీ చేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను ప్రస్తుత రవాణా శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఏపీఎస్ఆర్ ఆంజనేయులు అప్పజెప్పింది. ప్రస్తుతం మెంబర్ సెక్రటరీగా కొనసాగుతున్న మౌర్యను బదిలీ చేయడం ఒకెత్తయితే ఏరికోరి ఏపీఎస్ ఆర్ ఆంజనేయులుకి ఈ బాధ్యతలను కట్టబెట్టడంపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంజనేయులుకి స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుంది. పైగా ప్రభుత్వం అప్పచెప్పిన పనులను పూర్తి చేస్తారనే పేరు సదరు ఐపీఎస్ అధికారికి ఉంది.
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడంతో పాటు గ్రామ సచివాలయం ఉద్యోగ నియామక పరీక్షల విషయంలో గందరగోళం చెలరేగడానికి సహకరించిన ఏపీపీఎస్సీలోని కొందరు కీలక వ్యక్తుల భరతం పట్టేందుకే పీఎఎస్ఆర్ ఆంజనేయులుకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏపీఎఎస్ఆర్ ఆంజనేయులు ఎవరి మీద విరుచుకుపడతారోనని చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్ వేణు గోపాల్ కొనసాగింపు పైనా సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్ గా వేణుగోపాల్ కొనసాగుతున్న ఆయనను మార్చి వేరే వారిని నియమించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి పద్ధతిని అమలు చేయాలనే అంశంపై న్యాయ నిపుణులతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎపిపిఎస్సి చైర్మన్ స్థాయి వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు పంపి ఆమోదింప చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రక్రియకు ప్రభుత్వం తెరలేపే సూచనలు కనిపిస్తున్నాయి.