నేటి నుంచి ఐదు రోజులు ఏపి అసెంబ్లీ సమావేశాలు
posted on Dec 17, 2015 7:34AM
ఇవ్వాళ్ళ నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ముందుగా ఉభయసభలలో చర్చించవలసిన అంశాల గురించి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో చర్చించి అజెండా ఖరారు చేస్తారు. అసెంబ్లీ బిఎసి సమావేశానికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి బిఎసి సమావేశానికి డా.ఎ. చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. సమావేశాల అజెండా ఖరారు కాగానే ఉభయ సభలు సమావేశాలు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి శాసనసభకు బయలు దేరారు.
ఈసారి సమావేశాలు కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించబోతున్నప్పటికీ తెదేపా ప్రభుత్వానికి అవి కత్తి మీద సాముగా మారే అవకాశాలే కన్పిస్తున్నాయి. కల్తీ మద్యం, కాల్ మనీ, సెక్స్ రాకెట్, బాక్సైట్ తవ్వకాలు, విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ శలవు వ్యవహారం మొదలయినవన్నీ ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు బలమయియన్ ఆయుధాలుగా అందివచ్చేయి. కనుక ఈసారి వైకాపాను ఎదుర్కోవడానికి అధికార పార్టీ చాలా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.