వర్షాలు ఇంకా కురుస్తాయి
posted on Apr 13, 2015 @ 9:44AM
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. మండుటెండలు కాస్తాయని అనుకుంటే వర్షాకాలం తరహాలో పట్టినపట్టు వదలకుండా వర్షాలు కురవడం విచిత్రం. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరిగింది. అయితే వర్షాలు ఇంకా కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయట. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కర్నాటక నుంచి కేరళ మీదుగా కొమరిన్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి సైతం కదులుతోంది. వీటికి తోడు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. వీటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.