బాబూమోహన్ కు ప్రచారం చేయం.. అందోల్ బీజేపీ క్యాడర్ రివోల్డ్
posted on Nov 14, 2023 @ 9:35AM
అందోల్ బీజేపీ అభ్యర్థి, నటుడు బాబూమోహన్ కు సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబూ మోహన్ తరఫున పని చేసేది లేదని కుండ బద్దలు కొట్టేశారు. నియోజకవర్గంలో బీజేపీ ప్రతిష్ట మసకబారడానికి బాబూమోహన్ కారణమని ఆరోపించారు.
బాబూమోహన్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం నిరాడంబరంగా జరగడమే ఆయనకు నియోజకవర్గంలో పట్టులేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వట్‌పల్లి, అందోలు, టేక్మాల్, రాయికోడ్ మండలాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాబూ మోహన్ తరఫున ప్రచారం చేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ మేరకు వారు రాయికోడ్ మండలంలోని సిరూర్ లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. బాబూమోహన్ కు టికెట్ విషయంలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయాన్ని సైతం వారు తప్పుపట్టారు. అందోల్ లో బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కడం సంగతి అటుంచి, నోటాతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రజామద్దతు లేని బాబూమోహన్ కు ప్రచారం చేసి తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోలేమని వారు హై కమాండ్ కు తెలియజెప్పేందుకు తీర్మానించుకున్నారు. అదే సమయంలో తామంతా అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు మద్దతునివ్వాలని తీర్మానించారు. దీంతో ప్రచారం ప్రారంభం కాకుండానే బాబూమోహన్ ఓటమి ఖరారైపోయినట్లైందని పరిశీలకులు అంటున్నారు.