యూపీలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందా?
posted on Apr 17, 2023 @ 10:20AM
ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల పరిరక్షణ పేరిట యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాతియుగంలోకి రాష్ట్రాన్ని తీసుకు వెళుతోందా? ప్రభుత్వం మాఫియా, గూండాయిజం, రౌడీయిజం అణచివేత పేరిట సర్కార్ హింసకు తెరలేపిందా? అంటే రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు, చివరకు సామాన్య జనం సైతం ఔననే అంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ 178 మంది క్రిమినల్స్ ఎన్ కౌంటర్లో హతమయ్యారు. అంటే దాదాపుగా ప్రతి 13 రోజులకూ ఒక ఎన్ కౌంటర్ జరిగిందన్న మాట. 2022 ఎన్నికలలో యోగి సర్కార్ మరో సారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ ప్రభుత్వం మాఫియాపై ఉక్కుపాదం మోపడమూ ఒక కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే రాజ్యహింస భయంతోనే యోగి సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుందన్న రాజకీయ విమర్శలూ ఉన్నాయి. నేరస్థుడిని చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఇది రాజ్యాంగం చెబుతున్న మాట. అయితే యూపీలోని యోగి సర్కార్ మాత్రం తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదన్నది విపక్షాల విమర్శ.
ఇప్పుడు ఒక్క సారి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోడీ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తుందనీ, అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు, అవినీతి వంటి వాటిని ప్రోత్సహించడానికి కూడా వెనుకాడదనీ కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు మళ్లీ యూపీలో గ్యాంగ్ స్టర్ ల ఏరివేత పేర రాజకీయ లబ్ధి కోసం యోగి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు దాదాపు ఒకేటే అనేలా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాల వద్దకు వస్తే.. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో మోడీకి అస్మదీయుులగా పేరుపడ్డ వారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే తనకు మూడు వందల కోట్లు ముడుపులు అందుతాయని ఆఫర్ వచ్చిందన్నారు. అలాగే పుల్వామా ఘటన విషయంలో మోడీ సర్కార్ ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందో.. తీరా ఆ ఘటన జరిగిన తరువాత దానిని తన రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుందో సవివరంగా చెప్పారు.
పాకిస్థాన్ నుంచి ఆర్డీఎక్స్ తో వచ్చిన ట్రక్కు దాదాపు పక్షం రోజులు జమ్మూ కాశ్మీర్ రోడ్ల మీద యథేచ్ఛగా తిరిగినా గుర్తించలేని ఘోర నిఘా వెఫల్యాన్ని ఎండగట్టారు. అలాగే ఘటన జరిగిన తరువాత తనను నోరెత్తదంటూ స్వయంగా మోడీ ఫోన్ చేశారనీ, ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు కూడా అదే విధంగా ఫోన్ చేశారనీ వెల్లడించారు. ఏ మాత్రం భద్రత లేని విధంగా సీఆర్పీఎఫ్ దళాలను రోడ్డు మార్గంలో పంపడం సరైనది కాదనీ, వారిని ఎయిర్ లిఫ్ట్ చేయాలన్న తన సూచనను మోడీ సర్కార్ పట్టించుకోలేదనీ సత్యపాల్ మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇప్పుడు మళ్లీ యూపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంతమొందిస్తామని అసెంబ్లీ వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. న్యాయవాది బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి, ఉమేష్ పాల్ ను ప్రయాగ రాజ్ లో హత్య చేసిన హంతకులను మట్టిలో కలిపేస్తా ( మిట్టీ మే మిలాదేంగా) అని హెచ్చరించారు. ఆయన అన్నట్లుగానే లోక్ సభ మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హత మార్చారు. ఈ సంఘటన ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అది ఇంకా జనం మదిలో తాజాగా ఉండగానే.. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులైన మరో ఇద్దరు.. అసద్ తండ్రి అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లు దారుణ హత్య కు గురయ్యారు.
ఉమేశ్ పాల్ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్ చెకప్ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి పోలీసులు జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పోలీసు వలయంలో ఉన్న అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు దూసుకు వచ్చి పాయింట్ బ్లాంక్ లో తుపాకితో కాల్పులు జరిపి హత మార్చారు. ఈ ఘటనపై యోగి సర్కార్ ఒక విచారణ కమిటీ వేసింది. అది వేరే సంగతి. కానీ ప్రయాగ్ రాజ్ లో ఈ సంఘటన జరిగిన తరవాత అంతటా యోగి చెప్పింది చేశారన్న మాటే వినిపిస్తోంది.