Read more!

అనంతపురం రేంజ్ డిఐజిపై వేటు 

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఎన్నికల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కింది స్థాయి అధికారికి వెంటనే బాధ్యతలను అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన విధులను అప్పగించవద్దని ఆదేశించింది. ఈ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. 
డీఐజీ అమ్మిరెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీకి ఆయన సహకరిస్తున్నారని విపక్ష కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపారు. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది. ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.