ఆనం బ్రదర్స్ చంద్రబాబ్ ఆపర్స్ ఎంటో?
posted on Nov 26, 2015 @ 11:57AM
ఆనం బ్రదర్స్.. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ముఖ్య భూమిక పోషించారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేని కారణంగా ఆనం బ్రదర్స్ పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నేతలు ఒకవేళ టీడీపీలోకి వెళితే వారికి ఎలాంటి పదవులు దక్కుతాయి అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీకి వచ్చే ఆనం బ్రదర్స్ కోసం రెండు పదవుల్ని సైతం సిద్దం చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు వారికి ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా చూడాలన్న మాటను పార్టీ వర్గాలకు బాబు ఇప్పటికే చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతలు.. చిన్నోడైన ఆనం రాంనారాయణ రెడ్డికి.. పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. కాగా ఆనం బ్రదర్స్ డిసెంబరు 5న టీడీపీలోకి చేరేందుకు ముహుర్తంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు.