ఇవేం పోలికలు..పొగడ్తలకు హద్దూ పద్దూ ఉండక్కర్లేదా?
posted on Dec 22, 2022 @ 1:48PM
అభిమానం ఉండటం వేరు.. అది వెర్రి తలలు వేయడం వేరు. జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన అహింసామూర్తి మహాత్మాగాంధీని.. రాజకీయ పదవుల కోసం నిత్యం వ్యూహాలు, ఎత్తులలో మునిగిపోయే వారెక్కడ. తమ అభిమాన నాయకులను మహాత్ములతో పోల్చి పొగడ్తలు గుప్పించడం నాయకులకు సర్వ సాధారణమైపోయింది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారత జాతిపిత మహాత్మాగాంధీ అయితే అభినవ భారత జాతి పిత నరేంద్రమోడీ అంటూ ఆకాశమే హద్దుగా తన కవితా ప్రతిభను ప్రదర్శించారు. నాగపూర్ రచయతల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన అభివన జాతి పిత వ్యాఖ్యలు రాజకీయ కాక సృష్టిస్తున్నాయి. విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతుంటే.. నెటిజన్లు విపరీంగా ట్రోల్ చేస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధులను, జాతీయ చిహ్నాలను అవమాన పరిచేలా అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భావజాలం వ్యాప్తి కోసం గాంధీజీని మళ్లీ మళ్లీ చంపేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబడుతున్నారు.
అయితేఅమృతా ఫడ్నవిస్ ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం ఇది మొదటి సారి కాదు, 2019లో ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పంపిన ట్వీట్‌లో ‘మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు’ ట్వీట్ చేశారు. ఆ కాలానికి ఛత్రపతి శివాజీ, నేటి కాలానికి డా. బీఆర్ అంబేద్కర్, ఆధునిక కాలానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఐకాన్‌లంటూ గతంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.