జీవితం చెక్కిన మానవతామూర్తి అంబేడ్కర్
posted on Apr 14, 2023 7:32AM
ఏప్రిల్ 14.. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక మరపురాని రోజు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ప్రతి ఏటా ఈ రోజున దేశ వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంబేడ్కర్ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈఏడాది వేడుకలకు మంరింత ప్రత్యేకత తోడైంది. గత సంవత్సరం అంబేడ్కర్ 125 జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ పేరున నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ( ఏప్రిల్ 14) న ఆవిష్కరిస్తున్నారు.
అయితే విగ్రహాన్ని అవిష్కరించడం ఒకటైతే, అంబేడ్కర్’ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మరొక విషయం. ముఖ్యంగా అంబేడ్కర్ రాజ్యాంగానికి కాలం చెల్లిందనే భావన వ్యక్తమవుతున్న నేపధ్యంలో,ఈ జయంతి వేడుకలను కేవలం వేడుకలుగానే కాకుండా అంబేడ్కర్ ఆశలు, ఆశయాలతో పాటుగా, రాజ్యాంగం మంచి చెడులపై వివేచనతో కూడిన చర్చజరిగితే అది మంచిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సమీక్షించ వలసిన సమయం వచ్చిందని, ఎవరో కాదు,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో చాలా దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు దేశంలో అతి పెద్ద మార్పు రావలసిన అవసరం ఉందని, అందుకు అంబేడ్కర్ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం ఉందని కూడా అన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసేఅర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శకు గురయ్యాయి.
అయితే అప్పట్లో కేసేఆర్, అంబేడ్కర్ పై వ్యాఖ్యలు చేసిన సమయ సందర్భాలను పక్కన పెట్టి, స్వయంగా అంబేడ్కర్ రాజ్యాంగాన్నితగల బెట్టాలని అన్నారని తమ వాదనను గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే,అదే కేసీఆర్ ఈరోజు అంబేద్కర్ జయంతి సందేశంలో మాత్రం రాజ్యాంగ ప్రస్తావన చేయలేదు. వివాదాల జోలికి వెళ్ళలేదు. సందర్భోచితంగా, అంబేడ్కర్ గోప్పతాన్ని మెచ్చుకున్నారు. దేశ భవిష్యత్ కు సంబంధించి గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు అందించిన మేధావి అంబేడ్కర్ అని అన్నారు.
అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇచ్చిన సందేశంలో కేసీఆర్, గతానికి భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో … పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేడ్కర్ జీవితం నేర్పిస్తుంది. అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఆయన ఎదుర్కొని జీవించిన విధానం ఎంతోమందికి మార్గదర్శకం. అని పేర్కొన్నారు.
ఆయన రచనలు, ప్రసంగాలు ఆలోచింపజేస్తాయి.దేశంలో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.అయితే కేసీఆర్ ఎప్పుడు ఏమన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా, అంబేడ్కర్ ఒక మనిషిగా, మానవతా వాదీగా చరిత్ర పుటల్లోనే కాదు, భారతీయుల హుదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతారు.
ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా జీవితం చెక్కిన సంపూర్ణ మానవతామూర్తి అంబేడ్కర్. అవును, 1891 ఏప్రిల్ 14న మది ప్రదేశ్ లో జన్మించిన అంబేద్కర్,జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడిగా చూశారు. స్కూల్కు వెళ్లినా వేరేగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాసులో కూర్చోనిచ్చేవారు కాదు.ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఆర్థిక వేత్తగా, న్యాయకోవిదునిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. అందుకే, ఎవరు ఏమన్నా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం