ఆసియా సంపన్నులు.. మోదీ హయాంలో అపర కుబేరులు..
posted on May 21, 2021 @ 11:55AM
ప్రధాని మోదీ దేశ సంపదంతా అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నాడనేది విపక్షాల ఆరోపణ. ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ.. అంబానీ, అదానీలు మాత్రం ఆసియాలోకే సంపన్నులుగా ఎదిగారు. రిలయన్స్ గ్రూపు మొదటి నుంచీ రిచెస్ట్ కంపెనీగానే ఉన్నా.. అదానీ గ్రూప్ మాత్రం ఇటీవల కాలంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలోని పోర్టులన్నిటిలోనూ ఆదానీ కంపెనీ పాగా వేస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు పోర్టులు అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయాయి. ఇలా తీర ప్రాంత వ్యాపారమంతా దాదాపు అదానీ హస్తగతంలోనే ఉంది. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, పవర్ జనరేషన్, ఫ్రీడమ్ బ్రాండ్, ఇలా పలురకాల వ్యాపారాలతో గడిచిన పదేళ్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఆశ్చర్యకరంగా.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగానే.. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలోనే.. గుజరాత్‌కు చెందిన అదానీ.. ఆసియా కుబేరుల్లో నెంబర్ 2 పొజిషన్‌కు చేరుకున్నాడు. మరో గుజరాతీ అయిన ముకేశ్ అంబానీ తర్వాత స్థానంలో నిలబడ్డాడు.
తాజాగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద మరింత పెరిగింది. ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ ప్రకారం.. ఇంతవరకూ ఆసియా నెం.2గా కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీతో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు అనగా సుమారు రూ.4.86 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో అదానీ.. చైనాకు చెందిన షాన్షాన్ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరారు.
ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్ల మేర పెరగగా.. షాన్షాన్ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ఇక ఆసియా నెం.1 గా ఉన్న ముకేశ్ అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో సుమారు రూ.5.58 లక్షల కోట్లు. అంటే అంబానీ, అదానీల మధ్య సుమారు లక్ష కోట్ల మేర తేడా ఉంది. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13, అదానీ 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు.