అమరావతి రైతుల ఉద్యమం@1500 డేస్!
posted on Jan 25, 2024 @ 11:29AM
అమరావతి రాజధాని ఉద్యమం దేశంలోనే అత్యంత సుదీర్ఘ కాలంగా నిర్విరామంగా సాగిన, సాగుతున్న ఉద్యమంగా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న ఉద్యమం గురువారం (జనవరి 25) నాటికి 1500 రోజుల మైలురాయిని చేరింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేపట్టిన ఉద్యమం నిరంతరాయంగా సంవత్సరం నాలుగు నెలల రెండు రోజులు కొనసాగింది. అంటే 427 రోజులు కొనసాగిందన్నమాట. దేశంలో జరిగిన ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఒకటి. అయితే.. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరుకోవడమే కాకుండా ఇంకా కొనసాగుతూ ఉంది.
అడ్డగోలు విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు 33 వేలకు పైగా ఎకరాలను ప్రజా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. చంద్రబాబు పర్యవేక్షణలో సరికొత్త అమరావతి నగర నిర్మాణం వేగంగా జరుగుతుండగా, 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతి నగర నిర్మాణ నిలిచిపోయింది. జగన్ అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి అమరావతి కేవలం శానస రాజధాని మాత్రమేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఎంతో కష్టపడి పెంచిన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయింది. కొన్ని లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమరావతి రైతుల ఆశల్ని చిదిమేసినట్లయింది. వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరావతిని రాజధానిగా నిర్మించేందుకే తామంతా తమ భూములు ఇచ్చామని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు 2019 డిసెంబర్ 17న అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. నిరాహార దీక్షలతో పాటు వివిధ రూపాల్లో రైతులు ఉద్యమాలు కొనసాగించారు. కొనసాగిస్తున్నారు. రైతుల ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు తొలుత అనుమతించకపోవడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుని మరీ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో రైతులు, మహిళలు, కవులు రైతులు, చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాది మంది పాల్గొంటున్నారు. ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షలు చేశారు. సభలు నిర్వహించారు. దేవుళ్లు, దేవతలకు మొక్కులు కట్టారు. జలదీక్షలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతిలోని హైకోర్టు ప్రాంతం నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూశారు. అరెస్టులు అయ్యారు. అతీవ్ర నిర్బంధాలకు గురయ్యారు. వైసీపీ మంత్రుల నిందారోపణలు భరించారు. ఆకలి దప్పులతో అలమటించి కూడా అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఇసుమంతైనా సడలనీయకుండా నిరంతరాయంగా కొనసాగించారు. కొనసాగిస్తున్నారు.
ప్రధాని మోడీ స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. బీజేపీ జగన్ సర్కార్ మూడు రాజధానుల డ్రామాకు తెరదించడానికి ప్రయత్నించలేదు సరికదా.. పరోక్ష మద్దతు ఇచ్చింది. రాజధానులు ఎన్ని ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. లేదు అంటూ కేంద్రం నంగనాచి కబుర్లు చెప్పింది. రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతివ్వలేదు. అయితే రాజధాని ఉద్యమానికి రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతును గమనించిన తరువాత మాత్రమే బీజేపీ తాము అమరావతి రాజధానికి మాత్రమే కట్టుబడి ఉన్నామన్న ప్రకటన చేసింది. ఇక రైతులు న్యాయాలయం టూ దేవాలయం పాదయాత్రకు ఉపక్రమించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే బీజేపీ ఏపీ నేతలు అమరావతి రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు అమరావతి ఉద్యమం 1500 రోజుల మైలురాయికి చేరుకుంది. దేశంలోనే అత్యంత సుదీర్ఘ ఉద్యమంగా రికార్డు సృష్టించింది. చంద్రబాబు చెప్పినట్లు ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు. ఇంత జరుగుతున్నా.. స్పందించని ప్రభుత్వం, ప్రభుత్వాధినేత కూడా అరుదే. వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడం, ఎస్సీ రైతులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదు చేయడం, పాదయాత్రలో ఉన్న మహిళా రైతులకు కనీసం వాష్ రూమ్ లు కూడా అందుబాటులో లేకుండా చేయడం ద్వారా జగన్ సర్కార్ తన వికృతత్వాన్ని ప్రజల ముందు తానే నిస్సిగ్గుగా ఆవిష్కరించుకుంది. కోర్టులు కాదన్నా వినకుండా మొండిగా కోర్టు ధిక్కరణలకు సైతం పాల్పడి.. ముందుకు సాగుతోంది. అయితే రైతుల మొక్కవోని దీక్ష ముందు, సడలని సంకల్పం ముందు ప్రభుత్వం తలవంచక తప్పదు. వచ్చే ఎన్నికలలో అమరావతి రైతుల ఆగ్రహమే అగ్ని సునామీగా మారి జగన్ సర్కార్ ను తుడిచిపెట్టక మానదు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతుల ఉద్యమానికి లభిస్తున్న మద్దతునే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.