చుండూరు చరిత్రే చెప్పుతో దాడికి కారణమా?
posted on Feb 24, 2021 @ 10:59AM
బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డిపై చెప్పుతో దాడి. అది కూడా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లో. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది లైవ్ లో చూస్తుండగా జరిగిన ఈ దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టింది ఏ మామూలు వ్యక్తో కాదు. అమరావతి జేఏసీ కన్వీనర్. ప్రొఫెసర్ కొలికిపూడి శ్రీనివాసరావు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పాఠాలు చెప్పే మేథావి. జేఏసీ కన్వీనర్, విద్యావంతుడైన శ్రీనివాసరావు అంత సడెన్ గా ఎందుకిలా ప్రవర్తించాడనేది ఆసక్తికరం.
అప్పటి వరకూ డిబేట్ సాఫీగానే సాగింది. ఒక్కసారిగా మాటలు దాడి మొదలైంది. అమరావతి జేఏసీ కన్వీనర్ ను పెయిడ్ అర్టిస్ట్ అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు.. టీడీపీ ఆఫీసులో పని చేసుకో అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు... కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి ముఖంపై కొట్టారు. వెంటనే చర్చకు బ్రేక్ పడింది.
అంతటితో ఆగలేదు శ్రీనివాసరావు ఆగ్రహం. బ్రేక్ టైమ్ లో మరోసారి దాడి చేశారని అక్కడి వారు చెబుతున్నారు. మళ్లీ చెప్పు తీసుకొని విష్ణవర్థన్ రెడ్డిని చెడామడా బాదేశారట. లైవ్ లో ఎడమ కాలి చెప్పుతో కొడితే.. బ్రేక్ సమయంలో కుడి కాలి చెప్పు తీసి.. కసి తీరా కొట్టారట. ఛానల్ సిబ్బంది వచ్చి శ్రీనివాసరావును ఆపే ప్రయత్నం చేసినా ఆయనలో ఆగ్రహం అంత తొందరగా శాంతించలేదట.
అమరావతి జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ అయిన కొలికిపూడి శ్రీనివాసరావులో అంతటి ఆగ్రహం, ఆక్రోశం అంతకు ముందెప్పుడూ కనిపించలేదు. అనేక సార్లు టీవీ చర్చల్లో పాల్గొన్న ఆయన తన వాగ్ధాటితో, సబ్జెక్ట్ తో అందరినీ మెప్పించారే కానీ, ఇప్పటిలా ఇంతకు ముందెప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, వివాదరహితుడు. అలాంటి శ్రీనివాసరావు అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఆసక్తికర మూలాల్లోకి దారి తీస్తోంది.
కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడు. ఆయనది గుంటూరు జిల్లా చుండూరు గ్రామం. ఇప్పటి కోపానికి అప్పటి దారుణానికి సంబంధం ఉందని కొందరు అంటున్నారు. 1991లో చుండూరులో జరిగిన మారణకాండ ఆ గ్రామవాసుల గుండెల్లో ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఆ మానని గాయం ఇలా అగ్నిపర్వతంలా బద్దలైందని అంటున్నారు. ఆనాడు చుండూరులో జరిగిన ఘటనను మరోసారి గుర్తు చేస్తున్నారు.
1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు (రెడ్లు) దళితవాడపై దాడి చేశారు. వేట కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలతో దళితులను దారుణంగా చంపేశారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలో చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగా సంచిలో కుక్కి కాలువలో పడేశారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. 16 ఏళ్ల తర్వాత 2007లో ప్రత్యేక కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లగా 21మంది నిందితులకు విధించిన శిక్షను రద్దు చేసింది హైకోర్టు. ఇలా చుండూరు ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాయని మచ్చు.
ఆ చుండూరు బిడ్డే ఈ కొలికిపూడి శ్రీనివాసరావు. ఆనాటి దారుణం ఆ గ్రామవాసుల మాదిరే ఆయనలోనూ నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుందని అంటున్నారు. అందుకే ఆయనలో కట్టలు తెగిన ఆగ్రహం కనిపించిందని చెబుతున్నారు. ఒకనాడు ఏ అగ్రవర్ణాల చేతిలోనైతే తమ వారు బలయ్యారో.. ఆ వర్గం నేత మరోసారి తనపై మాటల దాడి చేస్తుండటాన్ని శ్రీనివాసరావు సహించలేకపోయాడు. క్షణికావేశానికి లోనై.. లైవ్ షో లో విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారని ఆ వర్గం వారి మాట. అసలు కారణం ఏదైనా.. నేటి శ్రీనివాసరావు దాడితో ఆనాటి చుండూరు ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ లో తెగ చర్చ జరుగుతోంది.