ప్లాన్ అదుర్స్
posted on Dec 12, 2023 @ 10:04AM
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... జగన్ పార్టీకీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ శాశ్వత సభ్యత్వానికే కాదు.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాసిన ఆ రాజీనామా లేఖను ఆయనే స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి మరీ సభాపతి కార్యదర్శికి అందజేశారు. అయితే ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి నమ్మిన బంటులా వ్యవహరించే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. మంగళగిరి నుంచి వరుసగా రెండు సార్లు జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఈ రాముడిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం.. శీతకన్ను వేశారని అంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో సైతం వరుసగా రెండోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారని.. అదీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి, అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత కుమారుడు అయిన లోకేష్ పై విజయం సాధించారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా, కానీ జగన్ తనకు కేబినెట్ లో చోటివ్వలేదన్న అసంతృప్తి ఆళ్లలో ఏర్పడిందంటున్నారు. కాగా ఇక 2019 ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన జగన్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి.. అసెంబ్లీకి పంపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని నియోజకవర్గ ప్రజల సాక్షిగా షిక్కటి చిరునవ్వుతో వాగ్దానం చేశారు. దీంతో తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారన్న ఉద్దేశంతో జనం ఆళ్లను వరుసగా రెండో సారి గెలిపించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆళ్లకు మాత్రం మంత్రిపదవి దక్కలేదు. అప్పటికి సరిపెట్టుకున్న ఆళ్ల 2022 ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా జగన్ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆళ్ల అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు.
జగన్.. కాంగ్రెస్ ను వీడి వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయన అడుగులో అడుగు వేసినా.. తనకు మంత్రిగిరి ఇవ్వకుండా.. 2019 ఎన్నికలకు ముందు జస్ట్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి చిలకలూరిపేట నుంచి గెలిచి తొలి సారి ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి మంత్రి పదవి కేటాయించడంతో ఆర్కే తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నారా లోకేశ్ ఓటమి పాలైనా.. నిన్న మొన్నటి వరకు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల మధ్యే ఉండడం.. వారి సమస్యలు తెలుసుకోని.. వాటి పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేయడం.. అంతేకాకుండా.. ఆ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవని పేరిట మొబైలు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం.. అలాగే వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తామంటూ ఇప్పటికే జనసేన, టీడీపీలు ప్రకటించడం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేకత కొట్టోచ్చినట్లు కనిపించడం.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో ఇదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చకు తాడేపల్లిలోని జగన్ అండ్ కో తెర తీసి.. ఆ క్రమంలో వ్యూహాత్మక పథక రచనకు శ్రీకారం చుట్టినట్లు సదరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో తాడేపల్లిలోని పెద్దలు స్వయంగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయించారని.. దాంతో రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే బరిలోకి దిగడం.. తద్వారా ఓట్లు చీల్చడంతో.. నారా లోకేశ్‌ను ఓడించాలనే ఓ ఎత్తుగడను ఖాయం చేసినట్లు ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా హీట్ హీట్‌గా సాగుతోన్నట్లు సమాచారం. ఇప్పటికే నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవలేక పోయారంటూ జగన్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లింది.. వెళ్తోంది. అంతేకాదు.. మంగళగిరిలో నారా లోకేశ్ ఓటమి కోసం.. సీఎం జగన్ అండ్ కో శక్తియుక్తులన్నీ దారపోస్తున్నారని... ఆ క్రమంలో ఇప్పటికే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎం హనుమంతరావును వైసీపీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవిని తెలుగేదేశం నుంచి వైసీపీలోకి తెచ్చుకుని రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు జగన్ అండ్ కో ఇప్పటికే నిర్ణయించిందని.. ఆ క్రమంలో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఆయనకు బాధ్యతలు కట్టబెట్టిందని.. ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పదవులన్నీంటికి రాజీనామా చేయించి.. కొత్త నాటకానికి తెర తీశారనీ, ఇలా మంగళగిరిలో నారా లోకశ్ ఓటమి కోసం.. జగన్ అండ్ కో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకొంటూ ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.