పాతపాటనే మళ్ళీ పాడిన ‘అఖిలం’
posted on Dec 28, 2012 @ 1:32PM
గారెల రుచి ఎలాఉంటుందో అందరికీ తెలిసినప్పటికీ, మళ్ళీ తినబోతూ గార్ల రుచి అడగినట్లుగానే, ఈ రోజు కేంద్రం నిర్వహించిన అఖిలపక్షసమావేశంలో ఏఫలితాలు వస్తాయో అందరూ ముందుగానే ఊహించినపటికీ, అడియాసతో అందరూ ఫలితాలకోసం మళ్ళీ ఆత్రంగా టీవీలముందు కూర్చొని ఎదురుచూసారు. అందరూ ఊహించిన ఫలితాలే వెలువడి ప్రజల రాజకీయ పరిణతిని మరోమారు నిరూపించాయి.
కాంగ్రెస్, వై.యస్సార్.కాంగ్రెస్, తెలుగుదేశం మూడు పార్టీలు కూడా రాష్ట్రవిభజనపై తమ స్పష్టమయిన వైఖరి చెప్పకుండా ఈసారీ తప్పుకొని, తెలంగాణావాదుల ఆగ్రహాన్ని నేటినుండి చవిచూడనున్నాయి.
హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే స్వయంగా కాంగ్రేసుపార్టీకి చెందినవాడయినప్పటికీ, తన పార్టీ అభిప్రాయాలను చెప్పకుండా ఈసమావేశంలో ఆయన కేవలం ఒక ప్రేక్షకపాత్ర పోషిస్తూ, మిగిలిన పార్టీల అభిప్రాయాలు సేకరించడనికే ప్రాదాన్యతని ఇచ్చేరు. అయితే, ఈ సమావేశంలో ఆయన రెండు కీలకనిర్ణయాలు ప్రకటించారు. అందులో మొదటిది రాష్ట్రవిభజనపై ఇదేఆఖరి సమావేశం అనే ప్రకటన కాగా, సరిగ్గా నెలరోజులలోపు తెలంగాణాసమస్యని పరిష్కరిస్తామని చేసిన ప్రకటన రెండవది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ‘నెలరోజుల గడువు’ తనకు తానూ విదించుకోవడం ఒక్కటే అది చేసిన సానుకూల ప్రకటనగా భావించ వలసి ఉంటుంది.
అయితే, అది తెలంగాణాకి సానుకూలమని అనుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, రాష్ట్ర విభజన సమస్యపై కాంగ్రెస్ ముందు అనేక పరిష్కారాలున్నాయని మనకి తెలుసు. రెండవ యస్సార్సి వేయడం లేదా తెలంగాణా అభివృద్ధి మండలిని ఏర్పాటుచేయడం వంటి మార్గాలువేటినయినా అది ఎంచుకొని పరిస్తితులు తనకు అనువుగా మారేవరకు, తెలంగాణా సమస్యని మరికొంతకాలం సాగాదీయవచ్చును.
అయితే, ఈ సమావేశంలో మొట్టమొదట మాట్లాడిన కాంగ్రెస్ ప్రతినిధి సురేష్ రెడ్డి మాత్రం తెలంగాణాకి అనుకూలంగా మాట్లాడారు. అయన సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తానూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్నే స్పష్టంగా వ్యక్తంచేసానని తెలిపారు. అయితే, సమావేశంలో ఆఖరిగా మాట్లాడిన మరో కాంగ్రెస్ సభ్యుడు గాదే వెంకటరెడ్డి మాత్రం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని అన్నారు. తద్వారా, సురేష్ రెడ్డి వాదనలు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలుగా పరిగనించలేని పరిస్తితి ఏర్పడింది.
ఇక, ముందే ఊహించినట్లు తెలుగుదేశం పార్టీ, వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజన బాద్యతను కేంద్రం మీదకి నెట్టేసి, ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్నరాజకీయ అనిశ్చితితికి దానినే బాద్యురాలిని చేసి చేతులు దులుపుకొని బయట పడ్డాయి. ఆరెండు పార్టీలు కేంద్రం ఏనిర్ణయం తీసుకొన్నా స్వాగతిస్తామని చెపుతూ బంతిని కాంగ్రేసు కోర్టులో పడేశాయి.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తానూ 2008లో కేంద్రానికి ఇచ్చిన లేఖకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామంటూ చెప్పి, తానూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలో వద్దో అనే విషయంపై స్పష్టమయిన ప్రకటన చేయకపోవడంవల్ల నేటినుండి తెలంగాణావాదుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడనున్నది.
రాష్ట్ర విభజన విషయంలో మొదటినుండి ఒక కచ్చితమయిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సిపీఐ, భారతీయజనతాపార్టీ, తెరాస. పార్టీలు ఖచ్చితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కోరగా, సిపియం పార్టీ రాష్ట్ర విభజనని వ్యతిరేకించింది. ఇటీవల, కాంగ్రేసుకు మద్దతు ఉపసంహరించిన యం.ఐ.యం. పార్టీకూడా రాష్ట్ర విభజనని వ్యతిరేకించింది. తప్పని సరయితే, రాష్ట్రాన్ని రాయల తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలుగా విభజించాలని కోరింది.
మొత్తం మీద ఈ అఖిలపక్షసమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నెల రోజుల సమయం దొరకపుచ్చుకోగలిగింది. అప్పటికి ప్రజలని, మీడియాని ఆకర్షించే మరో సంఘటన ఏదయినా జరుగకపోదా, తెలంగాణా సమస్యని మరికొంత కాలం సాగాదీయలేకపోతామా అని కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని సంతోషపడుతున్నా ఆశ్చర్య పోనవసర లేదు.
తెరాస. అధినేత కెసిఆర్ నేరుగా డిల్లీనుండే రేపు తెలంగాణాబంద్ కు పిలుపునిచ్చేసారు. ఇక రేపటినుండి తెలంగాణా బందులకు, నిరసన కార్యక్రామాలకు ప్రజలు సిద్దంగా ఉండక తప్పదు. రేపటినుండి, తెలుగుదేశం, కాంగ్రెస్, యస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడూ కూడా తెలంగాణాలో తీవ్రఇబ్బందులను ఎదుర్కొనవచ్చును.