అలీ నోట పోటీ మాట!
posted on Jan 17, 2023 @ 2:40PM
పేకాట పేకాటే..తమ్ముడు తమ్మడే అన్నది సామెత... ఇప్పుడు కమేడియన్ కం పొలిటీషియన్ అలీ ఆ సామెతనే కొద్దిగా మార్చి.. స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫ్రెండ్ అన్న పదానికి పవన్ కల్యాణ్, అలీ పర్యాయపదంగా ఉంటారు. అయితే అది ఇప్పుడు కాదు.. అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందు. ఆ తరువాత ఇరువురి మధ్యా అంత సఖ్యత లేదని సినీ రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.
ఒక సందర్భంగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అలీ గట్టిగానే కాదు ఘాటుగా కూడా తిప్పి కొట్టారు. ఆ తరువాత ఇరువురూ కూడా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండి పోయారు. ఇటీవల అలీ కుమార్తె వివాహం సందర్భంగా అలీ ఆహ్వానం పంపినా పవన్ కల్యాణ్ వెళ్లలేదు.. ఇరువురి మధ్యా స్నేహం కాదు.. కనీసం పలకరింపులు కూడా లేవనడానికి ఇదే నిదర్శనం అంటూ వచ్చిన వ్యాఖ్యలకు అలీ.. తన అలీతో సరదాగా ముగింపు సందర్భంగా యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో బదులిచ్చారు. విమానం మిస్ కావడం వల్లనే పవన్ కల్యాణ్ హాజరు కాలేదని అలీ వివరణ ఇచ్చారు. రాజకీయంగా వేరు అయినా ఇద్దరం మిత్రులమే అంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తాజాగా అదే అలీ..వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అని కూడా అన్నాడు. పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని చెప్పాడు. అప్పడు కూడా రాజకీయంగా వేరైనా మేం ఇద్దరమూ స్నేహితులమే అంటూ ముక్తాయించారు. అయినా రాజకీయాలలో స్థాయితో సంబంధం లేకుండా సవాళ్లు చేయడం సహజమే.. ఇటీవల కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేయడానికి తాను రెడీ, మరి చంద్రబాబు పుంగనూరులో పోటీకి సిద్ధమా అంటూ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఇలాంటి సవాళ్లు రాజకీయాలలో మామూలే. ఆ సవాళ్ల వెనుక పార్టీ అధినేతను మొప్పించే వ్యూహం ఉంటుందే తప్ప నిజంగా ఎవరూ కొండను ఢీ కొనాలని చూడరు. పెద్ది రెడ్డి సవాల్ అయినా, అలీ సవాల్ అయినా ఈ కోవలోకే వస్తుంది.
అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా పెద్దగా రాజకీయ ప్రసంగాల జోలికి పోని అలీ ఈ సారి పోటీ చేసేందుకు జగన్ టికెట్టిస్తారన్న ఆశతోనో మరెందుకో.. పొలిటికల్ ప్రసంగాలకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ 175 అవుటాఫ్ 175 స్థానాలను గెలచుకుకోవడం ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జనసేన, టీడీపీ మధ్య పొత్తు వార్తలను లైట్ తీసుకున్నారు. అవి రెండూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పెద్ద ఫరక్ పడదని అలీ చెప్పారు.
ఏదో సినిమాలో అలీ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి కండలు తిరిగిన వీరుడిలా కనిపించడానికి బెలూన్లను ధరిస్తాడు.. ఇప్పుడు రాజకీయాలలో కూడా సరిగ్గా అలాగే పవన్ కు దీటుగా కనిపించడానికి నేల విడిచి సాము చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆయన వైసీపీలో ఉన్న ఇంత వరకూ రాజకీయంగా విమర్శల జోలికి పోలేదు. కానీ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు.. ఒక సలహాదారు పదవి అలీని మార్చేసింది. వచ్చే ఎన్నికలలో మరింత కీలక పాత్ర దొరుకుతుందన్న ఆశతో విమర్శల బాట పట్టారు.