అలెగ్జాండర్ టెక్నిక్
posted on Oct 31, 2019 @ 9:30AM
మనం నడిచే నడక తీరులోనూ, నిల్చొనే భంగిమలోనూ... ఆఖరికి గాలిని పీల్చే విధానంలోనూ లోటుపాట్లను ఉంటాయని తెలుసు. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము. పైగా ఇలాంటి పొరపాట్లకి మన శరీరం కూడా అలవాటుపడిపోవడంతో... జీవితం సాగిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి చిన్నచిన్న లోపాలను సవరించుకుంటే మరింత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటామని తెలిస్తే. తెలిశాక ఓసారి ఆచరించే ప్రయత్నం చేస్తే! అలాంటి ప్రయత్నాలలో ఒకటి అలెగ్జాండర్ టెక్నిక్!
ఎవరీ అలెగ్జాండర్! అలెగ్జాండర్ మాధియాస్ అనే ఆయన 19వ శతాబ్దంలో పేరుగాంచిన ఒక నటుడు. అవడానికి అస్ట్రేలియాకు చెందిన ఈ అలెగ్జాండర్ లండన్‌లో షేక్‌స్పియర్ నాటకాలను ఆడుతూ మంచి పేరునే సంపాదించాడు. అయితే ఏమైందో ఏమోగానీ, అలెగ్జాండర్ గొంతు మూగబోవడం మొదలుపెట్టింది. అతన్ని పరిశీలించిన వైద్యులు నాటకాల్లో సంభాషణలు చెప్పేందుకు అరిచీ అరిచీ ఉన్నందుకు గొంతు కండరాలు దెబ్బతిన్నాయీనీ... మునుపటిలా మాటలు వచ్చే అవకాశాలు తక్కువనీ తేల్చేశారు. వైద్యుల మాటలు అలెగ్జాండర్‌లో నిస్తేజాన్ని కలిగించాయి. గొంతు పోవడం వల్ల తనకు ఇష్టమైన నాటకరంగం నుంచి దూరం కావడం అన్న ఆలోచన అతన్ని క్రుంగదీసింది. దాంతోపాటే రకరకాల ఆలోచనలూ ఆయనను చుట్టుముట్టాయి. ఒక్కసారి అద్దాల ముందు నిల్చొని తను సంభాషణలు చెప్పే విధానాన్ని చూసుకున్నాడు.
లోపాలు బయటపడ్డాయి: సంభాషణలు చెప్పే సమయంలో తన గొంతుని రకరకాలుగా తిప్పుతూ, దాని మీద లేనిపోని ఒత్తిడిని కలుగచేస్తున్నానన్న విషయం అర్థమైంది అలెగ్జాండరుకు. అదే తన అనారోగ్యానికి కారణమేమో అన్న ఆలోచనా మొదలైంది. అందుకని గొంతు కండరాల మీద అంతగా ఒత్తిడిని కలిగించకుండా సంభాషణలు చెప్పేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అలెగ్జాండర్ అనుమానం నిజమైంది. అతని ఉపాయం ఫలించింది. గొంతు కండరాల మీద అనవసరమైన ఒత్తిడిని నివారించినప్పుడు, అవి మళ్లీ యథాస్థితికి చేరుకోవడం గమనించాడు. రాదు అనుకున్న స్వరం మళ్లీ తిరిగివచ్చేసింది. దాంతో అలెగ్జాండర్ తన దృష్టిని పూర్తిగా ఇలాంటి పొరపాటైన అలవాట్ల మీదే కేంద్రీకరించడం మొదలుపెట్టాడు.
చాలానే ఉన్నాయి: అలెగ్జాండర్ పరిశీలన ప్రకారం మన నడక, పరుగు, మాట, తలని నిలపడం, బరువులు మోయడం... ఇలా కండరాల సాయంతో చేసే చాలా చర్యలు లోపభూయిష్టంగా ఉంటాయి. ఇలా కండరాలను తమదైన రీతిలో ఉపయోగించడం వల్ల కొన్నాళ్లకి, అవి కూడా అలాగే స్పందించడం మొదలుపెడతాయి. కొన్ని రకాలైన అభ్యాసాల ద్వారా ఈ భంగిమలను కనుక మెరుగుపరుచుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నది అలెగ్జాండర్ మాట. అలెగ్జాండర్ చూపిన ఈ ఉపాయమే ‘అలెగ్జాండర్ టెక్నిక్’గా విస్తృత ప్రచారాన్ని సాధించింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలలో ఈ టెక్నిక్‌ను నేర్పేందుకు కోర్సులు మొదలయ్యాయి. అలెగ్జాండర్ సమకాలికులైన బెర్నార్డ్ షా వంటి ప్రముఖులెందరో ఈ టెక్నిక్‌తో ప్రభావితం అయ్యారు. హక్స్‌లీ అనే ప్రముఖ రచయిత అయితే అలెగ్జాండర్ పాత్రతో ఏకంగా ఒక నవలనే రాసేశాడు.
అంతా నిజమేనా! అలెగ్జాండర్ టెక్నిక్‌ను నేర్చుకోవాలనుకునేవారి భంగిమలను నిశితంగా పరిశీలిస్తారు. ఆపై శిక్షకులు, ఆ లోపాలను సవరించేందుకు సాయపడతారు. యూట్యూబ్ లేదా పుస్తకాల ద్వారా కూడా ఈ టెక్నిక్‌ను కాస్త వంటి పట్టించుకోవచ్చు. ఈ టెక్నిక్‌ను అభ్యసించడం వల్ల ఒత్తిడి మాయం అవుతుందనీ, కంటిచూపు మెరుగుపడుతుందనీ, పార్కిన్‌సన్స్ వ్యాధి దూరమవుతుందనీ, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయనీ, అన్నిరకాల వెన్నునొప్పులూ తగ్గిపోతాయనీ.... ఇలా చాలా ఫలితాలనే చెబుతూ ఉంటారు శిక్షకులు. ఇవన్నీ శాస్త్రీయంగా రుజువు కాకపోయినప్పటికీ వెన్ను నొప్పి, మెడనొప్పి విషయంలో ఇది ఉపయోగపడుతుందని తేలింది. పార్కిన్‌సన్స్ విషయంలో కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందంటూ పరిశోధనలు తేల్చాయి.
- నిర్జర.