కాంగ్రెస్ పార్టీకి ఆకుల షాక్
posted on Mar 29, 2014 6:46AM
కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలి షాక్ తగిలింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్‌ఎస్ లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల తీరుతో మనస్తాపానికి గురై తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో కొనసాగే అంశంపై ఊగిసలాడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదింట కాంగ్రెస్ గెలిచింది. తమకు బలమైన స్థానాల్లో మల్కాజిగిరి ఒకటని అధిష్టానం లెక్కలు వేసుకుంటున్న తరుణంలో.. తాజా పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ.. సిట్టింగ్ శాసనసభ్యులను కాదని, తనకంటూ ఓ ప్రత్యేక జాబితా తయారు చేయడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా సర్వే అయితే గెలుపు కష్టమని, ఆ ప్రభావం తమపై పడుతుందని, ఆయన మల్కాజిగిరికి వద్దేవద్దని ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు శాసనసభ్యులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.