తప్పు చేస్తే కాలర్ పట్టుకుని నడిబజారులో నిలబెడతా! పార్టీ కార్పొరేటర్లకు అక్బర్ వార్నింగ్
posted on Dec 14, 2020 @ 8:38PM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ కార్పొరేటర్లకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని ఎవరినైనా వేధింపులకు గురి చేస్తే ఊరుకోబోనని చెప్పారు. డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానని అక్బర్ హెచ్చరించారు. కార్పొరేటర్లుగా ఎన్నికైన అందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని చెప్పారు అక్బరుద్దీన్ ఒవైసీ. అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని సూచించారు.
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్ లోని ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను అక్బరుద్దీన్ ఒవైసీ సన్మానించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని అన్నారు అక్బర్. ఈ ప్రాంతంపై తనకు ఎంతో ప్రేమ, మక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం తన ప్రాణం, తన శ్వాస అని తెలిపారు. అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.