ఎంఐఎం అక్బరుద్దీన్ ది దేశ ద్రోహమే : వెంకయ్య

 

 

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసి నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకే వస్తాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన హైదరాబాద్ లో నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

 

పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కి కోర్టు విధించిన ఉరి శిక్షను ప్రశ్నించడం నేరమేనని నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఓవైసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడారని నాయుడు అన్నారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

అసలు ఎంఐఎం పార్టీ ముస్లింల ప్రతినిధి ఎంత మాత్రం కాదని, అది కేవలం రజకార్ల సంస్థ అని నాయుడు అన్నారు. అసలు ఎంఐఎం మైనారిటీలకు చేసిందేమీ లేదని నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన హిందూ దేవుళ్ళను విమర్సిస్తోంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని నాయుడు ప్రశ్నించారు. ఆయన చట్టాన్ని అదుపులోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

ఒవైసీ వ్యవస్థను ప్రశ్నించే విధంగా మాట్లాడుతోంటే ముఖ్య మంత్రి, పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని నాయుడు అన్నారు.