కమలం గూటికి ఏకే ఆంటోనీ కుమారుడు
posted on Apr 6, 2023 @ 4:11PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, సన్నిహితుడైన నాయకుడు. అటువంటి నాయకుడి కుమారుడు బీజేపీ గూటికి చేరడం ఒక విధంగా కాంగ్రెస్ ను ఊహించని ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు.
ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ గా క్రియాశీలంగా వ్యవహరించిన అనిల్ ఆంటోనీ కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విబేధించారు.
ఆ కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన ఆయన వివరణను వినడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడకపోవడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్ లో కోటరీ గాళ్లదే రాజ్యం అయిపోయిందని ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్ ను వీడటం ఒకెత్తయితే.. బీజేపీ గూటికి చేరడం మాత్రం కాంగ్రెస్ జీర్ణించుకోలేని అంశమేనని పరిశీలకులు అంటున్నారు.
అంటోనీ కుమారుడు కమలం గూటికి చేరడం కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారుస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ కూడా తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కంటే మోడీ అండ్ కో తనను ఎక్కువగా గౌరవించారని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్ లో పాతతరం నాయకులకు, సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదంటూ వస్తున్న విమర్శలకు ఆంటోనీ కుమారుడు పార్టీ మారడం, ఆజాద్ వ్యాఖ్యలూ బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు.