హస్తినలో గాలి విషం!
posted on Nov 7, 2023 @ 11:00AM
దేశ రాజధాని నగరం హస్తినలో మనిషికి ప్రాణాధారమైన గాలే విషంగా మారిపోయిన పరిస్థితి. హస్తినలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హస్తినలో వాయు కాలుష్యం అన్నది కొత్తేమీ కాకపోయినా.. ఈ సారి అది ప్రమాద స్థాయిని దాటిపోయింది. వాయునాణ్యతా సూచీ ఇంతగా పడిపోవడమన్నది ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. హస్తినలో వాయికాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకోవడానికి కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలలో పంట వ్యర్థాలను ఇష్టానుసారం దగ్ధం చేయడమే కారణమని అంటున్నారు.
ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లలో శీతాకాలంలో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం ద్వారా వచ్చే పొగ కారణంగా వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోందని అంటున్నారు. సాక్షాత్తూ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్ లో ఉన్నట్లేనని వ్యాఖ్యనించడమే హస్తినలో వాయు కాలుష్యం తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయితే పర్యావరణవేత్తలు చెబుతున్నట్లుగా పంట వ్యర్థాల దగ్థం ఒక్కటే వాయు కాలుష్యం పెరిగిపోవడానికి కారణం కాదని చెప్పాలి. గ్రీన్ హౌస్ ఉద్గారాలు కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.
వాయుకాలుష్యం బెడద ఒక్క ఢిల్లీకి మాత్రమే పరిమితమైందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా భారత్ లోని ఇతర నగరాలు, పట్టణాలు సురక్షితంగా ఉన్నాయని నమ్మించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి నగరంలోనూ వాయుకాలుష్యం తీవ్రంగానే ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై అది చూపే ప్రతికూల ప్రభావం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
వాయుకాలుష్యం కారణంగా హస్తినలో సగటు ఆయుర్ధాయం పది సంవత్సరాలు తగ్గుతున్నదని ఒక అధ్యయనం ఇటీవల వెల్లడించిందంటే హస్తినలో వాయు కాలుష్య తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్టి కృషి. ముందుగా పర్యావరణ పరిరక్షణపై ఒక అవగాహన ఉండాలి. వాయుకాలుష్యం మానవ మనుగడకు ఎంత హానికరమన్న విషయంపై ప్రజలలో చైతన్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సరి బేసి వంటివి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే అవుతాయని గుర్తించాలి. ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టడానికి వీలు అవుతుంది. అలాగే పెద్ద ఎత్తున చెట్లు నాటడం కూడా వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి. అభివృద్ధి ముసుగులో సాగుతున్నపర్యావరణ విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడవుల నరికివేతకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అడవుల సంరక్షణకు చట్టాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పేర పర్యావరణ విధ్వంసం పెను ముప్పునకు కారణమౌతుంది. అయినా పర్యావరణం, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రగతి ముసుగులో దీర్ఘకాలంలో వినాశనానికి దారితీసే అభివృద్ధి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా మాత్రమే వాయు కాలుష్యం అరికట్టేందుకు వీలవుతుందన్న విషయాన్ని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.