ఎంతోమంది వాయుసేనలను అందిస్తున్న హైదరాబాద్‌లోని దుండిగల్ అకాడమీ...
posted on Oct 5, 2019 @ 11:41AM
త్రివిధ దళాల్లో వైమానిక దళం సేవలు ఎంతో కీలకమైనవి, గగనతలం నుంచి దేశ భూభాగాన్ని రక్షిస్తూనే మిగిలిన దళాలైన ఆర్మీ, నావెల్ ని కూడా అప్రమత్తం చేస్తుంది వాయుసేన. ప్రకృతి విపత్తులని సవాళ్లని ఓ వైపు ఎదుర్కొంటూనే మరోవైపు దేశ రక్షణలో అత్యంత కీలకమైన బాధ్యతను పోషిస్తోంది. వాయుసేన ఎనభై ఏడు సంవత్సరాలుగా ఎంతోమంది ఎయిర్ వారియర్స్ ను అందిస్తోంది. అక్టోబర్ ఎనిమిదవ తేదీన భారత వైమానిక దళ దినోత్సవం జరగనుంది. నిరంతరం గగనతలంలో గస్తీ కాస్తూ భూ, జల సేనలతో కలిసి దేశ రక్షణ బాధ్యతను ఎయిర్ ఫోర్స్ భుజాన వేసుకుంది. యుద్ధం సమయంలో మరింత చురుగ్గా పని చేస్తుంది, శత్రుమూకల వ్యూహాలను గుర్తించి ఆకాశంలోనే చీల్చి చెండాడే వైమానిక దళం ముందుగానే దాడుల్ని పసిగట్టి గగనతలం లోనే అలాంటి ముష్కర మూకలకు చెక్ పెడుతుంది. త్రివిధ దళాలలో వాయుసేన అందిస్తున్న సేవలు అత్యంత కీలకమైనవి. ప్రపంచ దేశాల్లో భారత వైమానిక దళం నాలుగో స్థానంలో ఉందన్నది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అంతేకాక అంతర్జాతీయ స్థాయి వాయుసేనల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. భారత్ లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో వాయుసేన ఏర్పాటైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వైమానిక దళం అందించిన చురుకైన సేవలకుగానూ రాయల్ అన్న గౌరవ పదాన్ని చేర్చారు. అప్పటిదాకా ఉన్న రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరును స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా మార్చేశారు. ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు వరకు జరిగిన యుద్ధాల్లో భారత వాయుసేన తన సత్తాను చాటింది. పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒకే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఐదుగురు పైలెట్ లతో ప్రారంభమైన వాయుసేన ఇప్పుడు తన అమ్ములపొదలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను చేర్చుకొని ఎంతో బలంగా మారింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వాయుసేనకు ప్రతి ఏటా ఎంతో మంది వీరాధి వీరులను ఎయిర్ వారియర్స్ ను అందిస్తోంది హైదరాబాద్ శివారు దుండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ.
ఈ అకాడమీలో సుమారు ఏడు వేల మంది సిబ్బంది ఉండగా అందులో పధ్ధెనిమిది వందలు మంది యూనిఫాం సిబ్బంది ఉన్నారు. ప్రతి ఏడాది ఈ అకాడమీ నుంచి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది క్యాడెట్ లను భారత వాయుసేనకు అందిస్తోంది. ఆ క్రమంలో అకాడమీలో ఇచ్చే శిక్షణ అంత సులువుగా ఉండదు, శిక్షణా కాలం నుంచే ప్రాణాలకు తెగించి ఫైటర్స్ రాటుదేలుతారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణకు ఎంట్రీ దక్కాలంటే ఖచ్చితంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి రావాల్సి వుంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ప్రధాన శిక్షణ కేంద్రమైన ఈ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పైలెట్లతో పాటు గ్రౌండ్ డ్యూటీ అధికారులనూ టెక్నికల్ వింగ్ సిబ్బందిని కూడా తీర్చిదిద్దుతుంది. అర్హత సాధించిన అత్యుత్తమ యువతీ యువకులను డేరింగ్ అండ్ డ్యాషింగ్ ధీరులుగా తీర్చిదిద్దటమే ఈ అకాడమీ లక్ష్యం. ప్రధానంగా ట్రైనింగ్ లో ఉన్న క్యాడెట్స్ కు శారీరక శిక్షణకు తోడు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, గౌరవం, అంకితభావం, మానసిక, శారీరక దృఢత్వాన్ని నేర్పుతారు. ఫ్లైయింగ్ కేడెట్స్ గా అకాడమీ లోకి వచ్చిన వారికి ముందుగా ఆరు నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. ఉదయం ఐదున్నర నుంచి వీరి దినచర్య ప్రారంభం అవుతుంది. పరేడ్ లో శిక్షణ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా స్విమ్మింగ్ కు వెళతారు. ఆ తర్వాత నుంచి వారి వారి విభాగాల్లోకి వెళ్లి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక పైలెట్లుగా శిక్షణ పొందే వారికి మూడు స్టేజ్ లలో శిక్షణను అందిస్తారు. స్టేజ్ వన్, స్టేజ్ టు ట్రైనింగ్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన ట్రైనింగ్ ల కోసం ఇతర ప్రాంతాలకు పంపుతారు. ముఖ్యంగా యుద్ధ విమానాలను నడిపే పైలెట్ లు, రవాణా విమానాలను నడిపే పైలెట్లు, హెలికాప్టర్ లకు చెందిన పైలెట్ లు ఇలా మూడు భాగాలుగా వారి వారి శారీరక తత్వాలను కాక్ పిట్ లో క్యాడెట్ లు ఇచ్చే సంకేతాలను బట్టి ఎంపిక చేస్తారు. పైలెట్ గా భారత వాయుసేనలో బాధ్యతలను స్వీకరించాలంటే సుమారు మూడు నుంచి ఐదేళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. రవాణా హెలికాప్టర్ పైలట్లకోసం మూడేళ్ళు పడితే యుద్ధ విమానాలను నడిపే పైలట్ లకు సుమారు ఐదేళ్ల పాటు శిక్షణ ఉంటుంది.
ఒక్కో పైలెట్ సుమారు పధ్ధెనిమిది వేల గంటల పాటు తమ శిక్షణలో భాగంగా ఆకాశంలోనే ఉండాల్సి ఉంటుంది. ఫ్లయింగ్ ఆఫీసర్ లు, పైలట్ క్యాడెట్ లకు ముందుగా అకాడమీ లోని సిమ్యులేటర్లపై శిక్షణ అందిస్తారు. అక్కడ ఓ భారీ స్క్రీన్ పై విమానం నడుపుతున్నట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ప్రస్తుతం క్యాడెట్ లు నేర్చుకుంటున్న పిలాటస్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన కాక్ పిట్ కూడా ఉంటుంది. ఇక్కడ వారికి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు, బేసిక్ ట్రైనింగ్ పూర్తయిన తరవాత ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్లే ముందు క్యాడెట్ లకు తగు జాగ్రత్తలు, సూచనలు చేస్తారు. పైలెట్ క్యాడెట్ లకు పిలాటస్ పిసి 7 ఎం.కె 2 అనే ఎయిర్ క్రాఫ్ట్ లపై ట్రైనింగ్ ఉంటుంది. గతంలో సూర్య కిరణ్ లో ట్రైనింగ్ ఇప్పించేవారు కానీ, కొన్ని సాంకేతిక కారణాలతో ఇప్పుడు అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ లో శిక్షణను అందిస్తున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వర్థమాన పైలెట్ లు చెప్తున్నారు. ఓ వైపు ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రైనింగ్ ఇస్తూనే మరోవైపు వారికి ఆయుధ శిక్షణ కూడా ఇప్పిస్తారు. అకాడమీలో ఉన్న ప్రత్యేక ప్రాంతంలో క్యాడెట్ లకు ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు, ఇందులో ఫైరింగ్ ప్రధానమైంది.ప్రతి క్యాడెట్ కు తుపాకులు, ఆయుధాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. కొన్ని సందర్భాల్లో శిక్షణ సమయంలోనైనా లేదంటే విధి నిర్వహణలో భాగంగా శత్రుదేశంలో పడినప్పుడు దీటుగా ఎదుర్కోవటానికి ఈ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇటీవల జరిగిన అభినందన్ ఘటనే ఇందుకు ఉదాహరణ. విపత్కర పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యం. పాకిస్థాన్ భూభాగంలో దిగిన అభినందన్ ఘటనలు సమయానికి అక్కడి ఆర్మీ సిబ్బంది రావడంతో అతన్ని ప్రాణాలతో తీసుకువచ్చారు లేకుంటే స్థానికులు అతనిపై మరింత తీవ్రంగా దాడి చేసే అవకాశం ఉండేదంటున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటి వరకు ఈ అకాడమీ నుంచి వేలాది సంఖ్యలో క్యాడెట్ లు వాయుసేనలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు వేల పదకొండులో నాలుగు వందల ఎనభై మూడు మంది, రెండు వేల పన్నెండులో నాలుగు వందల డెబ్బై నాలుగు మంది, రెండు వేల పదమూడులో నాలుగు వందల ఎనభై ఐదు మంది, రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఎనభై మంది, రెండు వేల పదిహేడులో రెండు వందల ఎనభై ఎనిమిది మంది, రెండు వేల పదహారులో రెండు వందల పదమూడు మంది, రెండు వేల పదిహేడులో రెండు వందల పదిహేను మంది, గతేడాది రెండు వందల తొంభై ఒక్క మంది ఫ్లయింగ్ ఆఫీసర్ లు, గ్రౌండ్ డ్యూటీ అధికారులుగా భారత వాయుసేనలో విధుల్లో చేరారు.