ఖర్గే వర్సెస్ థరూర్ అధ్యక్ష పీఠం ఎవరిదో?
posted on Oct 17, 2022 7:01AM
ఇంచు మించుగా రెండున్నర మూడేళ్ళుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముహూర్తం రానే వచ్చింది. సోమవారం ( అక్టోబర్ 17) కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకునేందుగా దేశ వ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మందికి పైగా ఉన్న పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత లోక్ సభ ఎంపీ, శశి థరూర్’ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది, ఎప్పుడో 137 ఏళ్ల నాడు, 1885 డిసెంబరు 25న మాజీ బ్రిటిషు అధికారి ఏ. ఓ. హుమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్ర పోరాటం తుదిఘట్టంలో మహాత్మా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్ట అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం మాత్రం,ఇది ఆరవసారి. అయితే అదంతా చరిత్ర. అలాగే, ఆ కాంగ్రేస్ ఈ కాంగ్రెస్ ఒకటేనా, అంటే అది మళ్ళీ వేరే చర్చ అవుతుంది. 1969 చీలికకు ముందున్న భారత జాతీయ కాంగ్రెస్’ ప్రస్తుత కాంగ్రెస్’, ఒకటి కాదనే వాదన ఒకటుంది.
ఆ అంశాన్ని అలా పక్కన పెట్టి, ప్రస్తుతంలోకి వస్తే, అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. ఈ 24 ఏళ్లలో ఇంచు మించుగా 22 ఏళ్లకు పైగా సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. మధ్యలో కొద్ది కాలం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయడంతో మళ్ళీ సోనియా గాంధీనే, తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇదొక రికార్డ్. నెహ్రూ, ఇందిరా గాంధీ సహా ఎవరూ కూడా రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు.
అదలా ఉంటే, గాంధీ కుటుంబం సభ్యులు (సోనియా, రాహుల్, ప్రియాంక) అధ్యక్ష పదవి వద్దనుకోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి ముట్టేది లేదని భీష్మించుకు కూర్చోవడం వలన ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపధ్యంగా గాంధీ కుటుంబ బయటి వ్యక్తులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్’ పోటీలో నిలిచారు. గాంధీ కుటుంబం తటస్థ వైఖరిని ప్రకటించినా, తెర వెనక తతంగం మరోలా ఉందని, శశి థరూర్’ ఆరోపించారు. గాంధీల దృష్టిలో ఇద్దరు సమానమే కానీ , ఖర్గే కాసింత చాలా ఎక్కువ సమానం’ అనే ఆరోపణలు/విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఖర్గే ఎన్నిక లాంచానమే అంటున్నారు.
నిజానికి ఖర్గే గాంధీలకు విధేయుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినా ఖర్గే, పోలింగ్;కు గంటల ముందు కూడా తమ విధేయతను మరోమారు చాటుకున్నారు. రిమోట్ కంట్రోల్ అన్నా,ఇంకొకటన్న తాను పట్టించుకోనని అవమానంగా భావించనని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీల సూచనలు సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడనని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన గాంధీలను తప్పు పట్టడం సరికాదని, గాంధీలు దేశానికి, పార్టీకి చేసిన మేలును మరిచిపోలేమని అన్నారు.
మరో వంక శశి థరూర్’ కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, అయితే పార్టీ పని విధానంలో మార్పు రావాలని, అన్నారు. ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన యంగ్ టర్క్’ వాయిస్ వినిపించారు. మార్పు కోరుకునే యువకులంతా తన పక్షాన ఉంటే,యథాతథ స్థితిని కోరుకునే వృద్ధులు ఖర్గే పక్షాన ఉన్నారని చెప్పు కొచ్చారు. అయితే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు అందుకుంటారు అనేది, అక్టోబర్ 19 న తేలి పోతుంది.