అంతరాన్ని మరపిస్తున్న ఆనందం!
posted on Aug 4, 2022 @ 8:35PM
ప్రతీవారి జీవితంలో బాల్యం జీవితాంతం గుర్తుచేసుకునే అనుభూతుల భాండాగారం. వయసు పెరిగేకొద్దీ చిన్నవారిని చూసిన పుడల్లా అపుడు తాను చేసిన అల్లరో, ఆటనో, ఇంట్లో గోల.. ఏదో ఒకటి మెదడులో మెరిసి కాస్తంత చిర్నవ్వును ప్రసాదిస్తాయి. అప్పటికి మనసు భారం తగ్గించే మహా టాబ్లెట్ అవుతుంది. బడిలో నాలుగయిదు తరగతులు చదివే రోజుల్లో అమ్మమ్మదగ్గరో, తాతగారి దగ్గరో ఏదో ఒక కథో, మరేదో వింత కబురో, పాటో వింటూ గడిపేయడంలో ఆనందం తిరిగి రాదు. కాలం కదిలి పోతూం టుంది. జ్ఞాపకాల లయ జీవితంలో రవ్వంత సంతోషపు మెరుపునిస్తుంది. అది ఏ క్షణమైనా కావచ్చు.
ఉద్యోగవిరమణ తర్వాత చాలమంది మనవడితోనో, మనవరాలితోనో సరదా మాటలతో, వారిని ఆడిస్తూ గడపడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. చాలామంది పిల్లలకీ అదే కావాలి. ఎందుకంటే వారికి ఏనుగమ్మ ఏనుగు ఆటలో ఏనుగు కావాలి గదా?! ఇందులో గొప్ప సైన్స్ ఉందంటారు మానసికశాస్త్రవేత్తలు. అటు పెద్దవారికి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం పదిల పడటంతో పాటు పిల్లలకు వారికి మధ్య అంతరం తగ్గి అనేక మాటలు, సరదాల పరదాల వెనక అనుబంధం పటిష్టపడు తుందిట. నిజమే. పిల్లలు పెద్దయ్యేకొద్దీ ఇంట్లో తల్లిదండ్రులతో మాటలు కరవవుతున్నాయి.. మరీ ఈరోజుల్లో. దీనికి వారినీ తప్పుపట్టలేం. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆ విధంగా పరుగులు పెట్టిస్తున్నాయి. జీవనంలో వేగం పెరిగింది. కలిసి తినడం, కలిసి ఒకే సమయం లో కలిసి మాట్లాడుకోవడం, పోనీ టీవీ చూడటం .. అన్నీ క్రమేపీ దూరమవుతున్నాయి. పిల్లలు వారి ఉద్యోగాల హడావుడిలో రాత్రింబవళ్లూ శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు.
ఇక పసిపిల్లల్ని చూసుకునే బాద్యత మళ్లీ తల్లిదండ్రులకే పడుతోంది. ఇది తప్పని పరిస్థితి. కానీ వీరికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కారణం వీళ్లూ మళ్లీ పిల్లలు కావడానికి ఇష్టపడు తున్నారు. అదే జీవితంలో అందం, ఆనందం. శరీరానికే వయసు లెక్క.. పిల్లల్ని చేరదీయడంలో మనసుకీ వయసుకీ అంతరం తగ్గుతుంది. పెద్దవాళ్లు ఏనుగులవుతున్నారు.. పిల్లలు రాకుమారులవుతున్నారు.. హాలు, షికారు రాస్తా అవుతోంది!