ఏ వయసులో ఏం తినాలో తెలుసా?

ఆహారమే మనిషి జీవితానికి ముఖ్యమైన వనరు. ప్రాణ శక్తిని అందించేది ఆహారమే. సరైన ఆహారం తీసుకోవడం వల్ల  ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘాయుష్షు సాధ్యమవుతుంది. అయితే వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే వయసుకు తగిన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. పిల్లలు, పెద్దలు అందరికీ పోషకాలు అవసరమే. అయితే పెరిగే కొద్ది కండరాలు, ఎముకలకు తగినంత బలం కూడా కావాలి. టీనేజ్  దాటగానే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలే భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. 20, 30, 40, 50 అలా ఏ వయసు దాటిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో తెలిసినవారు చాలా తక్కువ. దీని గురించి తెలుసుకుని వయసుకు తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

20 ఏళ్ల వయసులో ఏం తినాలి?

20ఏళ్ళ వయసున్నవారు అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. వీటిలో  ప్రోటీన్లు,  తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే చేపలు, అవిశె గింజలు, వాల్ నట్ లలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తీసుకోవాలి. ఇవి శరీరం దృఢంగా ఉండటంలో సహాయపడుతుంది.

30ఏళ్ళ తరువాత ఏం తినాలి?

30ఏళ్ళు దాటగానే శరీరంలో జీర్ణక్రియలు కొద్దిగా నెమ్మదిస్తాయి. ఈ సమయంలో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. క్వినోవా, బ్రౌన్ రైస్, చిలగడ దుంపలు వంటి వాటిలో ఉండే కార్భోహైడ్రేట్లు శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అలాగే కండరాల సామర్థ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చురుకైన జీవనశైలి ఉన్నవారికి తగినంత ప్రోటీన్లు అవసరం.  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం, రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగాతీసుకోవాలి.

40ఏళ్ళ తరువాత ఏం తినాలంటే?

40ఏళ్ళ తరువాత గుండె, ఎముకల ఆరోగ్యం  గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో హార్మోన్లలో మార్పులు, కండరాల సామర్థ్యం తగ్గడం,  మొదలైనవి కూడా జరుగుతాయి. వీటి ఆరోగ్యం కోసం  చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, బీన్స్, చిక్కుళ్ళు, వంటి లీన్ ప్రోటీన్ గల ఆహారాలు తీసుకోవాలి. అవకాడో, నట్స్, గింజలు, ఆలివ్ నూనె, వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తాయి.  అదే విధంగా పైబర్ అధికంగా ఉన్న ఆహారం  తీసుకోవాలి. 40ఏళ్ళ తరువాత బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి   కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

50 ఏళ్ళ తరువాత  ఏం తినాలి?

50ఏళ్ళ తరువాత శరీరంలో ఉన్న శక్తిని కాపాడుకోవాలి.  వయసుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండరాలు చాలా బలహీనంగా మారే వయసు ఇది. కండరాలు, ఎముకలు, మెదడు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రోటీన్, కాల్షియం, ఒమెగా-3 బాగా తీసుకోవాలి. 50 ఏళ్ల తరువాత దాహం బాగా తగ్గుతుంది. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది కిడ్నీ సమస్యలకు, శరీరం డీ హైడ్రేషన్ కావడానికి కారణం అవుతుంది. అందుకే 50ఏళ్ళ తరువాత నీరు, ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి.

                                            *నిశ్శబ్ద.