రాజధాని రాజకీయం... పార్టీల మధ్య నలిగిపోతున్న రైతులు...
posted on Dec 20, 2019 9:13AM
ఏపీలో రాజధాని రగడ రోజురోజుకీ మరింత తీవ్రమవుతోంది. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై అమరావతి రైతులు భగ్గుమన్నారు. సీఎం జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ 29 రాజధాని గ్రామాల్లో రైతులు బంద్ నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాజకీయాలకు తమను బలి చేయొద్దంటూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని, లేదంటే తెలంగాణ తరహా ఉద్యమానికి సైతం వెనుకాడబోమని రాజధాని రైతులు హెచ్చరించారు.
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు తమకు ప్లాట్లు అప్పగించలేదని, మూడు రాజధానుల వ్యాఖ‍్యలతో అమరావతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే గానీ, పరిపాలనా వికేంద్రీకరణ కాదంటోన్న అమరావతి రైతులు... ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాజధాని రైతుల బంద్ తో అమరావతిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించి రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో, పలు గ్రామాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
అయితే, రాజధానిపై పార్టీల మధ్య జరుగుతోన్న పోరుతో రైతులు నలిగిపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రాజధాని కోసం భూములిచ్చినా తమకెందుకీ పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీల మధ్య రాజకీయ పోరులో అమాయకులైన అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.