పాతికేళ్ల తర్వాత మళ్లీ తాలిబన్ రాజ్యం.. భయంభయంగా అప్ఘనీస్తాన్ జనం..
posted on Aug 16, 2021 @ 3:42PM
పాముల పుట్ట ఒక్కసారిగా చెదిరితే ఎలా ఉంటుంది? కలుగులో దాక్కున్న విషనాగులన్నీ వీధుల్లో స్వైర విహారం చేస్తే ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్థాన్లో 1994 తరువాత నెలకొన్న దారుణ పరిస్థితులను ప్రపంచం ఇంకా మరచిపోలేదు. అవే దుష్పరిణామాలను మరోసారి నెమరు వేసుకునే పరిస్థితులు ఆఫ్ఘన్లో దాపురించాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ నుంచి క్రమంగా వెను దిరుగుతున్న క్రమంలోనే ఆఫ్-పాక్ సరిహద్దుల్లో మాటువేసి ఉన్న తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం చేసుకున్నారు. అధ్యక్షుడి భవనాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు అధ్యక్షుడు తన సిబ్బంది సహా కజకిస్తానో, కిర్గిజిస్తానో పారిపోయాడు. ఇంకేముంది? తాలిబాన్లు పాలనా పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే మిగిలింది.
తాలిబాన్లంటే ఇంత వణుకెందుకు?
తాలిబాన్ల పరిపాలన ఎలా ఉంటుందో ప్రపంచం ఇప్పటికే రుచి చూసింది. వారి ఆలోచనలు, వారి కార్యాచరణ ఎలా ఉంటుందో పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. అసలు తాలిబాన్ల డిక్షనరీలో ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమే లేదంటే అతిశయోక్తి కాదు. షరియా చట్టాన్ని విశ్వవ్యాప్తం చేయడమే వీరి లక్ష్యం. తాలిబాన్లు, ఐసిస్, ముజాహిదీన్లు.. ఇలా ఏ పేరు చెప్పుకున్నా.. అందరి లక్ష్యం ఒకటే. అందుకే వేర్వేరు ఆర్గనైజేషన్ల కింద పనిచేస్తున్నవారు సైతం ఏ సమయంలోనైనా ఒక్కటిగా మారిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో జరిగింది కూడా అదే. 1994 ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగుపెట్టిన తాలిబాన్లు 1996 లో అక్కడి పాలకుల్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి.. వారి అరాచకాలతో ప్రపంచాన్ని వణికించారు. చిన్నా చితకా విగ్రహాలే కాదు.. బమియాన్ వంటి అతిభారీ బుద్ధ విగ్రహాలను శక్తిమంతమైన మందుపాతర్లు, రాకెట్ లాంచర్లు పెట్టి కూల్చేశారు. యునెస్కో వారసత్వ హోదా ఉన్న అనేక గొప్పగొప్ప కట్టడాలను నేలమట్టం చేశారు. ఇక ఆఫ్ఘనిస్థాన్లో గంజాయి అక్రమ వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న శీతల అటవీప్రాంతాలే గంజాయి సాగుకు కేంద్రాలు. అదే వారికి వస్తు మారకానికి, తాలిబాన్ల విలాసాలకు, ఆఫ్ఘన్లోని ధనవంతులైన కుటుంబాలకు ఆదాయం సమకూర్చే వస్తువు. ఏటా నాలుగు బిలియన్ డాలర్ల గంజాయి వ్యాపారం జరుగుతుందని అంచనా.
ఇక పరిపాలన విషయానికొస్తే వారి టార్గెట్ అంతా మహిళలు, చిన్నపిల్లలే కావడం గమనించాలి. ఈ విషయమే ఆధునిక ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. మొదటిసారి పవర్లోకి వచ్చిన తాలిబాన్లు మహిళల డ్రెస్ కోడ్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్టే ఈసారి కూడా వచ్చీ రావడంతోనే మహిళల డ్రెస్ కోడ్ మీదనే పడ్డారు. ఇంకా కాబూల్ కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఓ మహిళ టైట్ గా డ్రెస్ వేసుకుందని భారీ కత్తితో నడిబజారులో అందరూ చూస్తుండగానే నరికేశారు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. వాటిని తలుచుకునే ప్రజలంతా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావడానికి జంకుతున్నారు. భవంతుల్లో ఉంటే ఎక్కడ పేలుస్తారోనని ధనవంతులు సైతం ఆరుబయటకొచ్చి తాలిబాన్లకు కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఎలా చెలరేగిపోతారో ఊహించుకొని భయపడుతూ.. అక్కడ బతకలేనివారు చాలా వేగంగా పట్టణాలు విడిచిపోతున్నారు. రాజధాని కాబూల్ లో ఇప్పుడంతా ఎటు చూసినా గడ్డాలు పెంచుకొని, సంప్రదాయ ఇస్లామిక్ దుస్తుల్లో ఆయుధాలు ధరించిన జిహాదీలే కనిపిస్తున్నారు.
తాలిబాన్ల పాలనలో స్కూళ్లు, కాలేజీలు నడవవు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. ఆడపిల్లలు సైతం చదువుకోవడానికి అవకాశం లేదు. పదేళ్లు దాటిన అమ్మాయిలు బుద్ధిగా ఇంటిపట్టునే ఉండాలి. ఆ వయసు దాటినవారు మగతోడు లేకుండా బయటికి రారాదు. ఒకవేళ వస్తే కఠిన దండన తప్పదు. అలా వచ్చినా కూడా తల నుంచి కాలి బొటనవేలు వరకు పూర్తిగా కవరయ్యేలా వస్త్రధారణ ఉండాలి. అంతేకాదు.. శరీర సౌష్టవం కూడా తెలిసేలా బిగుతైన కాస్ట్యూమ్స్ వాడరాదు. ఇవన్నీ పాటిస్తేనే తాలిబాన్ల రాజ్యంలో బతికే వీలుంది. ఇక రేపోమాపో విపరీతమైన ఆంక్షల నడుమ తాలిబాన్ల పాలన మొదలవుతుంది.
1996లో తొలిసారి ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లను 2001లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో సైన్యాలు తరిమేశాయి. ఇప్పుడు పాతికేళ్ల తరువాత అమెరికా సైన్యం వెనక్కి మళ్లడంతో మరోసారి ఆటవిక రాజ్యానికి తెర లేచింది.