ఆఫ్ఘన్ లో తాలిబన్లపై తిరుగుబాటు.. మన దేశానిదే కీలక భూమిక?
posted on Aug 18, 2021 @ 12:50PM
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నతాలిబన్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరో వంక ఆ దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ వచ్చిన కిరాతక పాలనకు భయపడి వణికి పోతున్నారు. ఆనాటి అరాచక పాలన, ఆకృత్యాలను గుర్తుచేసుకుని,మాన,ప్రాణాలను కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి పోతున్నారు. ఇక అక్కడ స్థిరపడిన విదేశీయులు అయితే, ఎవరి దేశాలకు వారు పరుగులు తీస్తున్నారు. మరోవంక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష భవనాన్ని వదలి పారి పోయారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఆఫ్ఘన్ మరోమారు తాలిబన్ల గుప్పిటిలోకి వెళ్లి పోయిందనే, నిర్ణయానికి వచ్చారు. ఆఫ్ఘన్ పరిణామాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ చిరు దివ్వెను వెలిగించారు. అంతే కాదు తనను తాను దేశ తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగంలోని నిబంధనలను ఉదహరిస్తూ సలేహ్ కారణాలు ఏవైనా అధ్యక్ష స్థానంలో అధ్యక్షుడు లేనప్పుడు, మొదటి ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడవుతారని తెలిపారు.అమెరికా, నాటోవలే తాము స్ఫూర్తిని కోల్పోలేదని పేర్కొంటూ సాలిహ్ తాలిబన్ అరాచకాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సమూహం “ప్రతిఘటన” లో చేరాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 న, తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించినప్పుడు, వారికి లొంగిపోయే ప్రసక్తి లేదంటూ అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు
“నేను ఎప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబ్ ఉగ్రవాదులకు తలవంచను. నా హీరో అహ్మద్ షా మసూద్. కమాండర్ ఆత్మ, వారసత్వాన్ని నేను ఎన్నటికీ మోసం చేయను. లెజెండ్, గైడ్. నా మాట విన్న మిలియన్ల మందిని నేను నిరాశపరచను”అని పేర్కొన్నారు. ఆ సమయంలో, సలేహ్ ఆచూకీ గురించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సమావేశంలోని అగ్ర నాయకుల చిత్రాలలో స్పష్టంగా కనిపించలేదు. ఆయన దేశం వదిలి పారిపోయారని అంటూ పాకిస్తాన్ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఖాతాలు పుకార్లు వ్యాపింపచేశాయి. దానితో సలేహ్ బయటకు వచ్చి, అన్ని పుకార్లను తోసిపుచ్చాడు.సలేహ్ ట్వీట్ చేసిన అదే రోజున తాను తాలిబాన్‌లో ఎన్నటికీ చేతులు కలిపే ప్రసక్తి లేదని అంటూ ఒక కొత్త చిత్రం తెరపైకి తెచ్చారు. పంజ్‌షీర్ లోయలో దివంగత తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌తో సంప్రదింపులలో సలేహ్‌ను ఆ ఫోటో చూపించింది.
తాలిబాన్ చేతికి చిక్కని ఒకే ఒక్క ప్రాంతం పంజ్‌షీర్ వ్యాలీ. ఇక్కడి నుంచే తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడిందని ఇప్పుడు కధనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ తాజిక్ కమాండర్, అహ్మద్ షా మసౌద్’కు గతంలోనూ తాలిబన్లను ఎదిరించడంలో, భారత్ సహా ఇరాన్, రష్యా వంటి దేశాలతో ఉత్తర కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించారు. ఈ కూటమి సాయుధమై తాలిబాన్లను తరిమికొట్టింది. పంజ్‌షీర్ లోయ దరిదాపుల్లోకి ఇంతకాలం తాలిబన్లను చేరనీయ లేదు.అలాగే, మసౌద్’ 1990 లలో, బుర్హనుద్దీన్ రబ్బానీ క్యాబినెట్‌లో అత్యంత శక్తివంతమైన రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత నిఘా సంస్థల నుండి శిక్షణ పొందారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ గూఢచారిగా, తరువాత అంతర్గత మంత్రిగా, దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడ ఆయన సారధ్యంలో పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.
వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఎజ్జతుల్లా మెహర్దాద్ పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని ధృవీకరించారు. “మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు” అని తెలిపారు. బీబీసీ ప్రతినిధి యల్డా హకీమ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే భౌగోళికంగా కీలకైమైన చైనా, పాకిస్థాన్ తాలిబన్లకు మద్దతు ప్రటించిన నేపధ్యంలో, మరో సరిహద్దుగా ఉన్న మన దేశం మరింత అప్రమత్తం కావలసిన అవసరం ఏర్పడింది. అలాగే, తాలిబన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు నిజమే అయితే, మన దేశం పోషించే పాత్ర కూడా కీలకంగా మారుతుంది. అందుకే మన దేశం ముందస్తు వ్యూహాలతో ముందుకు పోతోంది.