కర్ణాటక నుంచి రాజ్యసభకు ఖుష్బూ? తమిళనాడు ఎన్నికలే టార్గెట్
posted on Nov 7, 2020 @ 11:40AM
తమిళనాడులో పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించింది బీజేపీ. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సినీ తారలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ ఖుష్బూ బీజేపీలో చేరారు. ఖుష్బూను తమ స్టార్ కాంపెయినర్ గా భావిస్తున్న కమల దళం అమెను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖుష్బూను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు.
కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ స్థానానికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నిక జరగనుంది. ఆ సీటు కోసం ఖుష్బూతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కర్ణాటకలో పోలీసు ఉన్నతాధికారిగా సేవలు అందించి, రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఐపీఎస్ అధికారి అన్నామలై పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే బీజేపీ ప్రతిపాదనను రజనీకాంత్ అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన రాజకీయాలను దూరంగా ఉండాలని దాదాపుగా డిసైడయ్యారని చెబుతున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఖుష్బూను ఎంపిక చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఖుష్బూ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.