టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు!
posted on Dec 18, 2020 @ 12:04PM
ఏలూరులో వింత వ్యాధికి కారణమేమిటో కూడా చెప్పలేని అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వైసీపీది అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు అచ్చెమన్నాయుడు. జగన్ ను ఒక వింత ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. జగన్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజలు రాసుకుంటున్నారని.. అవకాశం వచ్చినప్పుడు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అచ్చెన్న చెప్పారు.
పన్నుల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జుట్టు మీద తప్ప మిగిలిన అన్నింటి మీద పన్నులు వేశారని విమర్శించారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన బీసీ సంక్రాంతి సభపైనా అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.ఎన్నికలు పెడితే కరోనా వస్తుందని జగన్ చెపుతున్నారని... వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా? అని ప్రశ్నించారు. బీసీలకు తెలుగు దేశం పార్టీ ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.