గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చీపురు చెక్!
posted on Dec 13, 2022 @ 11:06AM
దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దశాబ్దాల పాటు ఏకఛద్రాధిపత్యంగా దేశంలో అధికారంలో ఉన్నపార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ప్రధాన విపక్షంగానైనా తన స్థానాన్నినిలబెట్టుకోవాలని తాపత్రేయపడుతోంది. అయితే ఇటీవల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీన పడటం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది.
ఏదో గుడ్డిలో మెల్ల అన్న చందంగా హిమాచల్ లో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువే ఉండడాన్ని బట్టే కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ఎంత నేరోగా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ లో అయితే కాంగ్రెస్ గత ఎన్నికలలో సాధించినన్ని స్దానాలను కూడా గెలవలేకపోయింది. వరుసగా ఆరు సార్లు అధికారంలో ఉండి.. ఏడో సారి ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ గుజరాత్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదు. దీంతో ఈ సారి గుజరాత్ లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండి నడకే అనుకున్నారంతా. అయితే ఫలితాలు అందుకుపూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ సునాయాస విజయం సాధించింది.
ఇక ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయం తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ సోదిలోకి కూడా లేదన్నంతగా ఫలితాలు వచ్చాయి. ఈ మూడు ఎన్నికల ఫలితాలలో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తేలుతున్న విషయం ఏమిటంటే.. ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికి మసకబారింది. గుజరాత్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ను కబలించేయడానికి ఆప్ రోజు రోజుకూ బలపడుతోంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాకున్నా, ఆ తరువాతి ఎన్నికల సమయానికైనా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ఆప్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రస్థానం ప్రారంభించినది మొదలు ఏనుగు కుంభ స్థలాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందనేలాగే ఆ పార్టీ ప్రస్థానం కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ లను సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీలో బలపడింది. ఆ తరువాత అంచలంచలుగా ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నది. బీజేపీయేతర, కాంగ్రెస్సెతర పార్టీలకు, కూటములకు ప్రత్యామ్నాయంగా బలపడుతోంది. ఢిల్లీలో వరుసగా రెండవసారి అధికారం చేజిక్కించుకోవడమే కాకుండా, పంజాబ్ లో కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టి మరీ అక్కడ అధికారాన్ని దక్కించుకోవడం వరకూ.. ఆప్ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే దిశగానే సాగుతోందని చెప్పవచ్చు.
ఓట్లూ, సీట్లూ లెక్కలను పక్కన పెట్టి జనానికి చేరువ కావడం అన్న వ్యూహంతోనే ఆ పార్టీ అడుగులు వేస్తున్నది. ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రాలలో బలోపేతం కావడంపైనే దృష్టి పెట్టింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లూ, సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటువంటి సంచలనాలూ సృష్టించ లేదు.. కానీ రెండు రాష్ట్రాలలోనూ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. హిమాచల్ లో పోటీ చేసిన ఏ స్థానంలోనూ డిపాజిట్ దక్కించుకోకపోయినా.. ఆప్ ఆ రాస్ట్రంలో తన ఉనికిని బలంగా చాటిందనడంలో సందేహం లేదు. ఆప్ భావజాలం ప్రజలపై ప్రభావం చూపుతోందన్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల ఆలోచనలను ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా ఆప్ ప్రయత్నాలు ఫలించే సూచనలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కాకుండా మరో సింగిల్ పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఆప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు జనం ఆకర్షితులయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న స్థానంపై ఆప్ కన్నేసింది. ఢిల్లీలో అది సాధించింది.
ఇక జాతీయ స్థాయిలో ఆ స్థానం కోసం ఆప్ అడుగులు వేస్తోంది. కూటముల, ఫ్రంట్ ల కలగూర గంప ప్రభుత్వాలను చూసిన ప్రజలు సింగిల్ పార్టీగా జాతీయ స్థాయిలో ఆప్ కు ఓ చాన్స్ ఇస్తే అన్న ఆలోచన కలిగేలా చేయడం కోసమే ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విషయాన్ని గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలు తేటతెల్లం చేశాయి.