కేజ్రీవాల్ నన్ను చంపాలని చూస్తున్నారు..
posted on Jul 29, 2016 @ 12:07PM
ఒకపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ నన్ను చంపించాలని చూస్తున్నారని ఆరోపిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్ నన్ను చంపడానికి చూస్తున్నారని.. సొంత పార్టీ నేత.. మాజీ మంత్రి ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేశారు. అసలు సంగతేంటంటే.. ఆహార, పౌరసరఫరాల, పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన అసీమ్ అహ్మద్ ఖాన్ ను లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ నిజ స్వరూపానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు నా దగ్గర కొన్ని ఉన్నాయి.. అందుకే కేజ్రీవాల్ నన్ను చంపాలని చూస్తున్నారని.. గత తొమ్మిది నెలల నుండి నాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.. చంపుతామని ఫోన్లలో బెదరిస్తున్నారని, వ్యక్తిగతంగానూ వచ్చి హెచ్చరికలు జారీ చేశారని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖాన్ వెల్లడించారు. దీని గురించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ లకు లేఖలు రాశానని తెలిపారు.
ఇదిలా ఉండగా ఖాన్ చేసే ఆరోపణలను ఆప్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఆయన కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారు.. అంతకు మించి ఏం లేదు అని అంటున్నారు.