ఆమాద్మీకి ఎప్పుడూ కష్టాలే
posted on Sep 23, 2015 @ 11:32AM
డిల్లీలో ఆమాద్మీపార్టీ అధికారం చేప్పట్టి 7 నెలలు పూర్తయినప్పటికీ నేటికీ నిత్యం ఏదో ఒక తీవ్రమయిన సమస్య ఎదుర్కొంటూనే ఉంది. సబ్సీడీ ధరలో ఉల్లిపాయల విక్రయంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న ఆమాద్మీ ప్రభుత్వం మళ్ళీ మరో కొత్త సమస్య ఎదుర్కొంది. ఈసారి మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి నుండే సమస్య ఎదురవడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
సోమనాథ్ భారతి భార్య లిపిక మిత్రా తనను తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు ఆయనపై గృహ హింస కేసు నమోదు చేసారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం ఒక పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దానిని నిన్న తిరస్కరించింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ఆయన పోలీసులకి దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ “అసలు సోమనాథ్ భారతి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లి పోయారో, జైలుకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళడం వలన పార్టీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఆయన తక్షణం పోలీసులకి లొంగిపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేసారు.
ముఖ్యమంత్రి మాటను మన్నించి సోమనాథ్ భారతి పోలీసులకి లొంగిపోతారో లేదో చూడాలి. ఒకవేళ లొంగకపోతే ఆమాద్మీ పార్టీకి మరింత అప్రదిష్ట కలుగుతుంది. దానిని నివారించేందుకు పార్టీ ఆయనపై వేటు వేయవలసి వస్తే, పార్టీలో మళ్ళీ అసమ్మతి రాగాలు వినిపించవచ్చును. కనుక ఆయనపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆలోచించుకోకతప్పదు.