తమ్ముడి కోసం అక్క చేసిన పని..
posted on Mar 17, 2021 @ 4:04PM
ఆడ పిల్ల పుట్టిందంటే అరిష్టంగా భావించే ఈ రోజుల్లో.. తమ్ముడికి అన్నీ తానై సాగుతుంది ఓ అక్క. అయిదేళ్ల క్రితం నాన్న మరణించాడు. మూడేళ్లకు తల్లి మృతి చెందింది. అప్పటి నుండి అక్కే తమ్ముడికి అమ్మ నాన్నగా మారింది. తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పదో తరగతి పూర్తి చేసిన చేశాడు. అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు లేవు. చలివేసిన, వర్షం వచ్చిన వళ్ళు తడిచే రేకుల ఇల్లే వాళ్ళ పిట్టా గూడు మాత్రమే ఉంది.
అమ్మానాన్నలు ఉన్నారనే దైర్యం లేదు . చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ స్థితిలో పైచదువుల ఆలోచన విరమించుకొని కుట్టుపని నేర్చుకొని తమ్ముడిని చదివిస్తోంది ఒక సోదరి. అమ్మా నాన్న లేని లోటును తీర్చేలా అన్నీ తానే అయ్యి తమ్ముడిని సాకుతోంది. అయ్యో.. ఆడపిల్ల అని జాలిపడిన చుట్టుపక్కల వాళ్లు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడదామని ప్రయత్నించారు. కానీ తన దారి తాను చూసుకుంటే తమ్ముడిని ఆదుకొనే వారు ఎవరూ ఉండరనే భయంతో మూడుముళ్ల బంధానికీ తాత్కాలికంగా దూరమైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్‌కి చెందిన శ్రీలత (20) కథ ఇది. తల్లిదండ్రులు మల్లేశం, సుగుణ అనారోగ్య కారణాలతో మృతిచెందగా... శ్రీలత, ఆమె సోదరుడు ప్రశాంత్ దిక్కులేనివారయ్యారు. ఇరుకిరుకుగా ఉన్న రేకుల షెడ్డులోనే నివసిస్తున్నారు. తల్లి మరణించిన తర్వాత శ్రీలత కుట్టుపని నేర్చుకుంది. ఇంటి నిర్వహణతో పాటుగా తమ్ముడి బాధ్యతను తీసుకుంది. ప్రశాంత్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌తో చదవడం ఆపేసిన తాను.. తమ్ముడిని జీవితంలో స్థిరపడే వరకు చదివిస్తానంటోంది.
అమ్మానాన్నల వైద్య చికిత్స కోసం ఉన్న భూమిని అమ్మేశాం. చివరకు అప్పులే మిగిలాయి. నేను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే తమ్ముడిని చూసుకునే వారే ఉండరు. ఒంటరిగా ఎన్నో కష్టాలు పడతాడు. ప్రశాంత్‌కి ఏదైనా ఉపాధి దొరికే వరకు అండగా ఉండాలని పెద్దలు తెచ్చిన పెళ్లి ప్రస్తావనను తిరస్కరించాను’ అంటోంది శ్రీలత. పల్లెటూరు కావడంతో కుట్టుపని ద్వారా అరకొరగా డబ్బులు వస్తుండటంతో ఆచితూచి ఖర్చు పెడుతూ జీవనం సాగిస్తున్నారీ అక్కా తమ్ముడు. అగ్గిపెట్టెలాంటి రేకుల షెడ్డులో ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు. కొన్నిసార్లు మూడు పూటలా తినడమే కష్టంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్క కష్టం వృథా పోకుండా బాగా చదివి ప్రయోజకుడిని అవుతానని ప్రశాంత్ చెబుతున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకొని తానే పెళ్లి పెద్దగా మారి అక్క పెళ్లి జరిపిస్తానంటున్నాడు.